ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ.. ప్రయాణికులతో సరదాగా సంభాషణ.. (వీడియో)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసీసీ) యశోభూమి మొదటి దశను ప్రారంభించేందుకు వెళుతున్న సమయంలో మెట్రోలో ప్రయాణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రోలో సందడి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసీసీ) యశోభూమి మొదటి దశను ప్రారంభించేందుకు వెళుతున్న సమయంలో మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో ప్రయాణికులతో ముచ్చటించారు. వారితో సరదగా గడిపారు. అలాగే ద్వారకా సెక్టార్ 21 నుంచి కొత్త మెట్రో స్టేషన్ ‘‘యశోభూమి ద్వారకా సెక్టార్ 25’’ వరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
ద్వారకా సెక్టార్ 25లో కొత్త మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవంతో యశోభూమి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్‌కు కూడా అనుసంధానించబడుతుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపును ప్రారంభించిన తర్వాత ఢిల్లీ మెట్రో ఉద్యోగులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు.
ఢిల్లీ ద్వారకాలోని యశోభూమిప్రపంచంలోని అతిపెద్ద ఎంఐసీఈ (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు)లో ఒకటిగా మారబోతోంది. 8.9 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్రాజెక్ట్ ప్రాంతం, మొత్తం 1.8 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ బిల్ట్-అప్ ఏరియాతో సౌకర్యాలను కలిగి ఉంది. 73,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో 15 సమావేశ గదులు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆడిటోరియం, బాల్‌రూమ్, 13 సమావేశ గదులు మొత్తం 11,000 మంది ప్రతినిధుల కెపాసిటీని కలిగి ఉంటాయి.