న్యూఢిల్లీ: పని ఒత్తిడిని తగ్గించుకొనేందుకు యోగా ,ప్రాణాయామం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్రైనింగ్ పూర్తి చేసుకొన్న ఐపీఎస్ లకు సూచించారు. 
శుక్రవారం నాడు నేషనల్ పోలీస్ అకాడమీలో 71వ బ్యాచ్ ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ట్రైనింగ్ పూర్తి చేసుకొన్న ఐపీఎస్ లతో ఆయన మాట్లాడారు. గతంలో ప్రొబెషనరీ ఐపీఎస్ లను తన ఇంటికి పిలిచి మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. కానీ కరోనా కారణంగా ఈ దఫా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందన్నారు. తాను మిమ్మల్ని కలుస్తాననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

పని వల్ల ఒత్తిడి, పనిభారం ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. ఎక్కువ వర్షం పడితే రైతులు ఇబ్బంది పడతారన్నారు. శాస్త్రీయంగా మీరు కేసులను పరిష్కరించవచ్చన్నారు.

మీ ప్రాంతంలో పనిచేసే సమయంలో నెలకు ఒకసారి ఉపాధ్యాయులు, నిపుణులతో మాట్లాడాలని ఆయన సూచించారు. యోగా, ప్రాణాయామం  చేయడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. 

తమిళనాడు కేడర్ అధికారి కిరణ్ శృతితో ప్రధాని మోడీ మాట్లాడారు. పోలీసు అధికారుల మానసిక ఆరోగ్యాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర పోలీసులు ఎలా చర్యలు తీసుకొంటున్నారో తెలుసుకొన్నారు.

శిక్షణ పూర్తి చేసుకొన్న 131 మంది ఐపీఎస్ లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వీరిలో 28 మంది మహిళలున్నారు.2018 డిసెంబర్ 17వ తేదీన వీరంతా శిక్షణ కోసం వచ్చారు. ముస్సోరిలోని నేషనల్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ లో ప్రాథమిక శిక్షణ పూర్తైన తర్వాత హైద్రాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చారు.