కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి ప్రభుత్వ సంస్థలో అవినీతి తాండవించేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థను వారు నాశనం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ బ్యాంకుల్లో కేవలం ఓ ఫోన్ కాల్ ద్వారా తమకు కావాల్సిన వారికి లోన్స్ ఇప్పించుకునేవారని ఆరోపించారు. అలాంటి మొండి బకాయిల కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని...అలాంటి పరిస్థితుల్లో తాము చట్టాలను కఠినం చేసి దాదాపు 3లక్షల కోట్లు బకాయిలు వసూలయ్యేలా చేశామన్నారు. అలాగే బ్యాకింగ్ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగిస్తూ డిజిటల్ సేవలను అందుబాటులోకి  తెచ్చామని మోదీ గుర్తు చేశారు.

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. దేశ ప్రజలకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే  నీతివంతమైన పాలన అందుతొందని తెలిపారు. బిసి అంటూ బిఫోర్ కాంగ్రెస్ అని...ఏడి అంటే ఆప్టర్ డైనాస్టీ అంటూ కాంగ్రెస్ పై మోదీ సెటైర్లు వేశారు. 
 
55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ది జరగలేదని ప్రధాని మండిపడ్డారు. కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 55 నెలల్లోనే కాంగ్రెస్ కంటే ఎక్కువ అభివృద్ది పనులు చేసినట్లు మోదీ తెలిపారు. మోదీ, బిజెపి ఆలోచనలను వ్యతిరేకిస్తూ దేశానిక కాంగ్రెస్ దేశానికి చెడు చేస్తోందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు చెప్పేవారు సభలోనూ, సభ బయట ఒకేలా మాట్లాడతారని కాంగ్రెస్ నాయకులకు చురకలు అంటించారు. నిజాలు వినే అలవాటు లేని కాంగ్రెస్ కు తన మాటలు చెవికెక్కవని ప్రధాని విమర్శించారు.  

దేశంలోని దాదాపు10 కోట్ల మంది ధనిక ప్రజల కోసం కూడా మరుగుదొడ్లు నిర్మించామని సెటైర్లు విసిరారు. తాము నిరుపేదలు, గూడు లేని ప్రజల కోసం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా తమ ప్రాంతాల్లో ఇళ్లు కావాలని అడుగుతున్నారని తెలిపారు. ఎలాంటి పైరవీలు లేకుండానే ఈ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని మోదీ వెల్లడించారు. 

ఇక దేశంలోని పంచాయితీల ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ఇస్తామని గతంలో జరిగిన ప్రతి ఎన్నికల మేనిపెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని....కానీ అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోయేదని విమర్శించారు. డిజిటల్ ఇండియాలో కాంగ్రెస్ విఫలం అయ్యిందని...తాము మాత్రం విజయవంతంగా గ్రామాల వరకు డిజిటల్ వ్యవస్థను తీసుకెళ్లామని గుర్తు చేశారు. ఇలా దేశ వికాసం కోసం బిజెపి ప్రభుత్వం నిరంతర శ్రమిస్తోందని మోదీ తెలిపారు. 

ఇక మహాకూటమి పేరుతో దేశంలో కొత్త రాజకీయాలకు తెరతీశారని...దీని వల్ల దేశ ప్రజలకు ఒరిగేదేమీలేదని మోదీ విమర్శించారు. ఈ కూటమిలో వున్న పార్టీలు, నేతలు కనీసం ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదని అన్నారు. కోల్‌కతా వేదికగా కలిసిన మహకూటమిని దేశ ప్రజలు అంగీకరించరని అన్నారు. 

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్నామని మోదీ అన్నారు. తొలిసారి ఓటు హక్క వినియోగించుకుంటున్న యువతను ప్రోత్సహించాలని మోదీ దేశ ప్రజలకు సూచించారు.