ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. విపక్షాలకు దేశ ప్రయోజనాల కంటే కూడా వాటి స్వప్రయోజనాలే ముఖ్యం అని మండిపడ్డారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడూ ఆటంకాలు కలిగిస్తుంటాయని ఫైర్ అయ్యారు. 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రతిపక్షాలపై విమర్శలు కురిపించారు. వాటికి దేశం కంటే కూడా స్వప్రయోజనాలే ఎక్కువ ముఖ్యం అని మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు అవి తరుచూన ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఏ సకార్యం తలపెట్టినా వాటిని అడ్డుకోవడానికే ప్రయత్నాలు చేస్తుంటాయని వివరించారు. 

పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలు హోరెత్తుతున్న సంగతి తెలిసిందే. గతవారం ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి విపక్షాలు ఉభయ సభల్లోనూ ఆందోళనలు చేస్తున్నాయి. ధరల పెరుగుదలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

ప్రతిపక్షాలు అవి అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయలేక చతికిలపడ్డాయని ప్రధాని మోడీ ఆరోపించారు. కాబట్టి, ఇప్పుడు తమ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యానికి శ్రీకారం చుట్టినా ప్రతిపక్షాలు అందులో ఆటంకాలు సృష్టించడానికే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్‌మోహన్ సింగ్ యాదవ్ పదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు.

తాము ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షం వాటిని ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు. ఆ నిర్ణయాలను అమలు చేస్తే వాటిని వ్యతిరేకిస్తుంటాయని పేర్కొన్నారు. దేశ ప్రజలు వీటిని మెచ్చరు అని చెప్పారు. ఇటీవలి కాలంలో ఒక కొత్త ట్రెండ్ ముందుకు వచ్చిందని తెలిపారు. వారు నమ్మిన భావజాలం లేదా వారి రాజకీయ ప్రయోజనాలకే దేశం కంటే కూడా పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ రోజు నలుగు కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు అంటే ఆగస్టు 12వ తేదీ వరకు వారు అందులో పాల్గొనకుండా స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభలో ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేయవద్దని, హుందాగా వ్యవహరించాలని అంతకు ముందే ఆయన వార్నింగ్ ఇచ్చారు. నిరసన చేయాలనుకుంటే సభ వెలుపల చేయాలని సూచించారు. కానీ, ధరల పెరుగుదలపై ప్రభుత్వం చర్చించాల్సిందేనని వారు పట్టుబట్టారు. దీంతో వారు సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం వారు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు.