మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ఘటనలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా స్పందించారు. ఈ విద్వేషాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనసుల్లో ద్వేషాన్ని నింపుకున్నవారికి ప్రధాని సద్బుద్ది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. అదే విధంగా పలు కీలక అంశాలపై ఆయన స్పందించారు.

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల ఘట్టంపై ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ నసీరుద్దీన్ షా స్పందించారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి ఈ విద్వేష విషాన్నిఆపాలని కోరారు. విద్వేషాన్ని వెదజల్లుతున్న వీరిలో కొన్ని సత్‌బుద్దులను పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. హరిద్వార్ ధర్మ సంసద్‌లో బయటకు వచ్చిన విద్వేష ప్రసంగాలపైనా ప్రధాని మాట్లాడాలని, ఇది వరకే ఈ ఘటనపై స్పందించకుంటే తప్పకుండా మాట్లాడాలని అన్నారు. ట్విట్టర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫాలో అవుతున్న విద్వేషాన్ని విరజిమ్మే వారిని దారిలో పెట్టడానికి ఏమైనా చేయాలని పేర్కొన్నారు. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగి ఈ విషం మరింత పెరగకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శివుడిని తరుచూ అవమానిస్తున్నారని, అందుకే తాను తీవ్రంగా స్పందించానని ఆమె ఆ తర్వాత పేర్కొన్నారు. అనంతరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు గాను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నుపుర్ శర్మను సస్పెండ్ చేసింది. ఢిల్లీ మీడియా ఇంచార్జీ నవీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. వారి వ్యాఖ్యలు బీజేపీ వైఖరికి విరుద్ధమైనవని, అవి కొన్ని బాహ్య శక్తులు చేసిన వ్యాఖ్యలు అని పేర్కొంది.

వీటిపై నసీరుద్దీన్ షా స్పందిస్తూ.. హిందూ దేవుళ్లను అవమానిస్తున్నవారిని ఎవరినీ తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. అలాగే, బీజేపీ చెబుతున్నట్టు ఆమె బయటి మనిషి కాదని, ఆమె బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఆమె నిజాయితీగా క్షమాపణలు చెప్పినట్టు కనిపించడం లేదని, ఆ క్షమాపణలు ఆమె వ్యాఖ్యలతో గాయపడినవారిని ఏమాత్రం శాంతింపజేయవని ఆయన తెలిపారు. శాంతి, సమైక్యతల గురించి మాట్లాడినవారిని ఏడాదిపాటు జైలుకు పంపుతారని, అదే మారణహోం గురించి మాట్లాడినవారిని చేతిపై ఇలా ముట్టుకుని శిక్షించినట్టుగా వదిలేస్తారని ఆరోపించారు. ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు అమలు అవుతున్నాయని జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 నవలను ఉటంకిస్తూ వ్యాఖ్యానించారు.

అయితే, నుపుర్ శర్మను బెదిరించడం ఖండనార్హం అని తెలిపారు. ఇలా చేస్తే పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌లా మారతామని, వాటితో మనకు పోటీ అవసరం లేదని, కానీ, కొన్ని విషయాల్లో మన దేశంలోనూ అలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. గోవధ చేశారనే అనుమానాలతోనే ప్రజలను చంపుతున్నారు కదా అని వాదించారు.