పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. కూచ్ బీహార్ లో సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సిలిగురిలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ బీహార్లో చాలా విషాదకరమైన సంఘటన జరిగిందన్నారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. 

బీజేపీకి ప్రజలు మద్దతిస్తుండటాన్ని మమతా బెనర్జీ, ఆమె గుండాలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తన కుర్చీ చేజారి పోతోందని ఆమెకు తెలుసునని, అందుకే ఇంత నీచ స్థాయికి దిగజారి పోయారని దుయ్యబట్టారు. మమతా బెనర్జీ టీఎంసీ, వారి గూండాలకు ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని మోడీ అన్నారు.

దానిని వివరిస్తూ పశ్చిమబెంగాల్లో వారి విధానాలను అమలు చేయడానికి అనుమతించబోమని చెప్పారు. కూచ్ బీహార్ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరారు.

‘దీదీ, ఈ హింసాకాండ, భద్రతా దళాలపై దాడికి ప్రజలను రెచ్చగొట్టే చిట్కాలు, పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే చిట్కాలు మిమ్మల్ని కాపాడవు. పదేళ్ల మీ తప్పుడు పాలన నుంచి ఈ హింసాకాండ మిమ్మల్ని రక్షించదు’ అని మోదీ అన్నారు.

బెంగాల్లో అనేక దశాబ్దాల నుంచి కొనసాగుతున్న రాజకీయ వాతావరణంలో మార్పుకు సమయం ఆసన్నమైందన్నారు. బలవంతపు వసూళ్లు నుంచి విముక్తి పొందిన బెంగాల్ రాబోతున్నారు. సిండికేట్. కట్ మనీల నుంచి విముక్తి పొందిన బెంగాల్ ఏర్పడబోతోందని చెప్పారు.

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ శనివారం జరుగనుంది. కూచ్ బిహార్‌లోని సీతల్‌కుచ్చిలోని పోలింగ్ బూత్ వెలుపల సిఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ  తన భయాందోళనలు నిజమయ్యాయన్నారు. కేంద్ర బలగాల పట్ల తాను వ్యక్తం చేసిన ఆందోళనలో వాస్తవం ఉందని ఈ సంఘటన రుజువు చేసిందన్నారు.