PM Modi US Visit: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు చైనా, పాకిస్థాన్‌ల పేర్లు చెప్పకుండా ఇరు దేశాలను టార్గెట్ చేశారు.

PM Modi US Visit: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బిడెన్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం తరువాత ప్రధాని మోడీ, బిడెన్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు చైనా, పాకిస్థాన్‌ల పేర్లు చెప్పకుండా ఇరు దేశాలను టార్గెట్ చేశారు.

విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ఉక్రెయిన్ 'శాంతి' ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారతదేశం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు, దౌత్యం కోసం భారతదేశం పిలుపునిచ్చిందనీ, ఉక్రెయిన్‌లో శాంతిని పునరుద్ధరించడానికి తాము అన్నివిధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

భారతదేశంలోని పర్యావరణం, వాతావరణం గురించి ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయంలో పర్యావరణం, వాతావరణానికి ముఖ్యమైన స్థానం ఉందనీ, పర్యావరణం మనకు విశ్వాసమని తెలిపారు. భారతదేశం తన సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడమే అంతే కాకుండా ప్రపంచాన్ని రక్షించడానికి కూడా పని చేస్తుందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తానని, పారిస్‌ వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ప్రపంచంలోని ఏకైక G20 దేశం భారతదేశమని ప్రధాని మోదీ అన్నారు.

మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి గురువారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్ వద్ద స్వాగతం పలికారు ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం "గౌరవం" అని అన్నారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోదీతో మానవ హక్కుల అంశంపై చర్చిస్తానని అమెరికా అధ్యక్షుడు చెప్పారు.

ఈ సందర్బంగా ప్రధాని మోడీ తన మునుపటి దేశ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ-అమెరికన్ల కోసం వైట్ హౌస్ తలుపులు తెరవడం ఇదే మొదటిసారి అని అన్నారు. సుమారు మూడు దశాబ్దాల క్రితం.. అమెరికాకు తాను ఓ సాధారణ వ్యక్తిగా వచ్చాననీ, ఆ సమయంలో తాను వైట్ హౌస్‌ను బయటి నుండి చూశానని వైట్‌హౌస్‌లో చేసిన స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ తెలిపారు. ప్రసంగం తర్వాత, ప్రధాని మోదీ , అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ద్వైపాక్షిక చర్చలకు వెళ్లారు. పిఎం మోడీకి ముందు.. బిడెన్ తన ప్రసంగంలో భారతదేశం-యుఎస్ సంబంధాలను శతాబ్దపు "అత్యంత నిర్వచించే సంబంధాలు" అని కొనియాడారు.