మధ్యప్రదేశ్ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300పైగా స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఖాయమని అలాగే తాను ప్రధానిగా మళ్లీ ఎన్నికవ్వడం కూడా తథ్యమంటూ చెప్పుకొచ్చారు. 

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఖర్గోన్‌లో శుక్రవారం పర్యటించిన ఆయన కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దేశప్రజలంతా దేశ ప్రధానిగా మరోసారి తనను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. 

దశాబ్దాల అనంతరం వరుసగా రెండోసారి స్పష్టమైన మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి 300 స్థానాల్లో ప్రజలు పట్టంకట్టనున్నారని తెలిపారు.130 కోట్ల మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. 

ఓటు వేసేందుకు వెళ్తూ చరిత్ర సృష్టించనున్నారని, దేశంలో వరుసగా రెండోసారి మెజారిటీ ప్రభుత్వం కొలువుతీరనుందని మోదీ జోస్యం చెప్పారు. ఆదివారం ఆఖరి విడతలో మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఫలితాలు వెల్లడవనున్నాయి.