గుజరాత్: స్వరాష్ట్రంలో తన పర్యటనను ముగించుకునే ముందు ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చ జరిగినట్టు సమాచారం.
ప్రధాని నరేంద్ర మోడీ: ఈ ఏడాదిలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలలో పదును పెంచాయి. మరీ ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు అధికార బీజేపీ సర్కారు వైఫల్యాను ఎత్తి చూపుతూ తీవ్ర స్థాయి విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించినట్టు సమాచారం.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం ఉన్నందున, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఇక్కడ బీజేపీ రాష్ట్ర యూనిట్ కోర్ కమిటీ సభ్యులతో క్లోజ్డ్ డోర్ సమావేశాన్ని నిర్వహించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. శనివారం నుంచి రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ప్రధాన కార్యాలయం ‘శ్రీ కమలం’లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ సమావేశానికి హాజరైన అనంతరం ప్రధాని తన సొంత రాష్ట్ర పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్, రాష్ట్రానికి చెందిన చాలా మంది పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మాజీ సీఎం విజయ్ రూపానీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వాఘని, మాజీ మంత్రులు భూపేంద్రసింగ్ చుడాసమా, గణపత్ వాసవ, సిట్టింగ్ లోక్‌సభ సభ్యులు భారతీబెన్ షియాల్, రంజన్‌బెన్ భట్ తదితరులు ఈ సమావేశానికి హాజరైన ముఖ్య నేతలలో కొందరు. ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికలకు అధికార పార్టీ సన్నద్ధతను ప్రధాని మోడీ సమీక్షించారని, ఎన్నికల గెలుపు కోసం సూచనలు చేశారని పీటీఐ నివేదించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి సమావేశం ఆయన అధికారిక పర్యటనలో భాగం కాదు.. అయితే, దానిని ఆ తర్వాత చేర్చారు.
ఆదివారం సాయంత్రం మహాత్మా మందిర్‌లో సుజుకి మోటార్ కార్పోరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించడానికి మోడీ శ్రీ కమలం చేరుకున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కోర్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర నాయకత్వం చేసిన అభ్యర్థనను ప్రధాని అంగీకరించారని వాఘాని అనంతరం మీడియాకు తెలిపారు. అయితే ఈ సమావేశంలో అసలు ఏం జరిగిందనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ముఖ్యమంత్రి తన ప్రభుత్వం చేస్తున్న ప్రజానుకూలమైన పనిని గురించి పంచుకోగా, పాటిల్ పార్టీకి సంబంధించిన వివిధ సంస్థాగత అంశాలను గురించి ప్రధానికి వివరించారని సమాచారం. ఇతర సభ్యులు కూడా బీజేపీ పాలనలో ప్రజలు వివిధ ప్రయోజనాలను పొందుతున్నారనే దాని గురించిన కథనాలను కూడా పంచుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ రెండూ చేస్తున్న పనిపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు" అని వఘని విలేకరులతో అన్నారు.
