న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం ద్వారా కొన్ని పార్టీలు  రాజకీయ ఎజెండాను ముందుకు తెచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 

దేశంలోని తొమ్మిది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం   రూ. 18 వేల కోట్లను మోడీ ఇవాళ విడుదల చేశారు.

ఈ మేరకు శుక్రవారంనాడు దేశంలోని పలు రాష్ట్రాల రైతులతో  మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో ఆయన మాట్లాడారు. 

ఈ పథకం కింద దేశంలోని రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు జమచేస్తున్నారు. వాజ్ పేయ్ జయంతిని పురస్కరించుకొని ఇవాళ రైతుల ఖాతాల్లో కేంద్రం ఈ డబ్బులను జమ చేసింది.

దేశంలోని పలువురు రైతులతో మోడీ చర్చించారు. ఒడిశాకు చెందిన రైతుతో మోడీ మాట్లాడారు.  రైతుల నిరసనల పేరిట కొందరు నాయకులు తమ రాజకీయ భావజాలాన్ని ముందుకు తెచ్చుకోవడంలో బిజీగా ఉన్నారన్నారు. 

కేంద్రం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 70 లక్షల మంది బెంగాల్ రాష్ట్ర రైతులకు ప్రయోజనం దక్కకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. కేంద్రం పథకాల ప్రయోజనాలను బెంగాల్ రైతులు పొందలేకపోయారన్నారు. బెంగాల్ సీఎం వ్యవహరించిన తీరు తనను బాధించిందన్నారు. ఈ విషయమై విపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.

బెంగాల్ ను మమత బెనర్జీ నాశనం చేశారన్నారు. తమ స్వంత రైతులకు ప్రయోజనాలను ఆపడం ద్వారా రాజకీయాలు నడుపుతున్నారన్నారు.  ఏళ్ల పాటు కేరళను పాలించినవారు పంజాబ్ రైతులతో సెల్ఫీలు తీసుకొంటున్నారని ఆయన మండిపడ్డారు. కానీ స్వంత రాష్ట్రంలో మార్కెట్లను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ఆయన కోరారు. 

బెంగాల్, కేరళను నాశనం చేసినవారు  మార్కెట్లు, ఎపీఎంసీ గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 

నూతన వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు తమకు ఎక్కడ ఉత్తమ ధర లభిస్తోందో అక్కడ విక్రయించుకొనే వెసులుబాటు లభిస్తోందన్నారు. రైతులకు మేలు జరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రయోజనానికి ఎక్కువ పంటలను ఎంపిక చేసిందన్నారు. రైతుల గురించి పెద్దగా ఇవాళ మాట్లాడుతున్న పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారని ఆయన విపక్షాలను తీరును ఎండగట్టారు. 

దేశంలోని వెయ్యి మార్కెట్లను ఆన్ లైన్ లో కనెక్ట్ చేసినట్టుగా మోడీ చెప్పారు. ఈ మార్కెట్లలో ఇప్పటికే  లక్ష కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. . 

కిసాన్ క్రెడిట్ కార్డుతో కలిగే ప్రయోజనాల గురించి ఇతర రైతులకు చెప్పాలని ఆయన  ఆ రైతును కోరారు. 2019 తాను కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకొన్నానని ఆ రైతు మోడీకి చెప్పారు. బ్యాంకు నుండి తీసుకొన్న రుణంపై  4 శాతం వడ్డీకే లోన్ తీసుకొన్నట్టుగా చెప్పారు.

మధ్యప్రదేశ్ లోని ధార్ కు చెందిన రైతు మనోజ్ పాటిదార్ మోడీతో మాట్లాడారు. తాను పీఎం కిసాన్ సమ్మన్ నిధి కింద రూ. 10 వేలు అందుకొన్నట్టుగా చెప్పారు.  కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకొనే వెసులుబాటు దక్కిందన్నారు. ఈ ఏడాది తాను 85 క్వింటాళ్ల సోయాబీన్ ను ఐటీసీకి విక్రయించినట్టుగా మోడీకి చెప్పారు.