Asianet News TeluguAsianet News Telugu

‘యావరేజ్ స్టూడెంట్‌ ఏదీ సాధించలేడనుకోవడం తప్పు’.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లేఖను గుర్తు చేసిన ప్రధాని

ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తాను చదివిన స్కూల్‌కు రాసిన లేఖను ప్రస్తావించారు. తాను క్లాసులో ఒక యావరేజ్ స్టూడెంట్‌ను అని.. కానీ, అది తాను పురోగమించకుండా ఆపలేదని వివరించారు. కాబట్టి, యావరేజ్ స్టూడెంట్ అయినా.. ఆత్మివిశ్వాసం, సంకల్పం గొప్పగా ఉంటే విజయాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. ఈ లేఖనే ప్రధాని తాజాగా ప్రస్తావించారు.

pm modi recalls IAF pilot varun singh letter
Author
New Delhi, First Published Dec 26, 2021, 1:08 PM IST

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ఈ ఏడాది చివరి ఎడిషన్ మన్ కీ బాత్(Mann Ki Baat) కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి నెల చివరి ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడతారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి ఆదివారం ఇదే. ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌(Group Captain Varun Singh)ను ప్రధాని గుర్తు చేశారు. స్కూల్ పిల్లల కోసం ఆయన రాసిన లేఖ గురించి మాట్లాడారు. ఈ నెల 8న తమిళనాడులో చోటుచేసుకున్న చాపర్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, మరో 11 మంది జవాన్లు మరణించారు. ఈ క్రాష్ అయిన ఆ హెలికాప్టర్ బిపిన్ రావత్‌తోపాటే గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా ఉన్నారు. ఆ ప్రమాదంలో వరుణ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వారు అదే రోజు మరణించినా.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ హాస్పిటల్‌లో మరో వారం రోజులు చికిత్స పొందారు. ఆ తర్వాత పరిస్థితులు విషమించి మరణించారు. ఆ హెలికాప్టర్ క్రాష్‌లో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడైనా బతుకుతాడని భావించారు. కానీ, వారం తర్వాత ఆయన కూడా కన్నుమూశారు.

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో శౌర్య చక్ర పురస్కారంతో గౌరవించింది. ఈ పురస్కార సంబురాలను నిర్వహించుకోవడానికి ఆయన పిల్లలను ఎంచుకున్నారు. పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రోత్సహించాలని తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌కు లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాన మంత్రి తాజాగా తన మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. గ్రూప్ కెప్టెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడు తాను సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాన్ని చూశానని వివరించారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తాను చదివిన పాఠశాల ప్రిన్సిపల్‌కు రాసిన లేఖ అద్భుతంగా ఉన్నదని తెలిపారు. గ్రూప్ కెప్టెన్‌గా ఆకాశానికి ఎదిగిన ఆయన తన మూలాలు మరిచిపోలేదని ప్రధాని అన్నారు. ఆయన సంబురాలు జరుపుకోవాలంటే చిన్న పిల్లలను ఎంచుకుని వారికి మార్గనిర్దేశనం చేయాలని భావించాడని పేర్కొన్నారు.

Also Read: helicopter Crash : బిపిన్ రావత్ సహా 13 మంది పార్ధివ దేహాలకు ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ నివాళులు

ఆ లేఖలోని కొన్ని అంశాలను ప్రధాని మోడీ స్పృశించారు. సాధారణంగా క్లాసులో యావరేజ్ స్టూడెంట్ ఏమీ సాధించలేడనే భ్రమలు ఉంటాయని, ఆత్మ విశ్వాసం ఏదైనా సాధించవచ్చునని గ్రూప్ కెప్టెన్ స్థూలంగా విద్యార్థులకు తెలిపారు. ‘12వ తరగతి చదువుతున్నప్పుడు నేను యావరేజ్ స్టూడెంట్‌ను. ఫస్ట్ డివిజన్ ర్యాంకు సాధించడం చాలా కష్టం నాకు. చదువులోనే కాదు.. క్రీడలు, ఇతర అంశాల్లోనూ నేను యావరేజ్ స్టూడెంట్‌నే. కానీ, వైమానిక రంగంలో సేవలు అందించాలని, విమానాలపై నాకు ఎంతో తపించేవాడిని’ అని గ్రూప్ కెప్టెన్ తన లేఖలో పేర్కొన్నారు. ‘నేను యావరేజ్ స్టూడెంట్‌ను కాబట్టి.. ఏదో సాధిస్తాననే నమ్మకం నాలో ఎప్పుడూ కలిగేది కాదు. ఫైటర్ స్క్వాడ్రన్‌లో నేను తొలిసారిగా యువ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్‌గా బాధ్యతలు తీసుకున్నాక నా అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నా తనువు, మనస్సు పనిపై లగ్నం చేసి ఈ స్థాయికి చేరాను’ అని వివరించారు.

Also Read: Sulur Helicopter crash: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

కాబట్టి, విద్యార్థులు తాను యావరేజ్ స్టూడెంట్‌ను అనే బెంగ పెట్టుకోవద్దని, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చుననే సందేశాన్ని గ్రూప్ కెప్టెన్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొనే తీవ్ర ఒత్తిడిని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా కొంత విభిన్నంగా ఉండే.. సిగ్గు ఎక్కువ ఉండే విద్యార్థులకు ఇది మరింత కష్టతరమైన సమస్యగా మారుతుందని వివరించారు. ఈ లేఖను ప్రధాని మోడీ పేర్కొంటూ 12వ తరగతిలో వచ్చే మార్కులే జీవితాలను నిర్దేశిస్తాయని భావించవద్దని, ఆత్మ విశ్వాసం, సంకల్పంతో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చునని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios