న్యూడిల్లీ: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. 84 సంవత్సరాల వయసున్న ఆయన ఇటీవలే కరోనా బారిన పడటంతో తీవ్రంగా అనారోగ్యంపాలయ్యారు. ఈ క్రమంలో ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువాత పడినట్లు కుమారుడు అభిజిత్ ముఖర్జీ ప్రకటించారు.

ప్రణబ్ ముఖర్జీ మృతిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. '' భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల యావత్ భారతం దు:ఖిస్తోంది. ఆయన మన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి చెరగని ముద్ర వేశారు. సమర్థులు, అత్యున్నత రాజనీతిజ్ఞులు. రాజకీయాల్లో హద్దులను చెరిపేసి సమాజంలోని అన్ని వర్గాలచే మెచ్చుకోబడ్డారు'' అంటూ ప్రణబ్ ముఖర్జీ నుండి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలను ప్రధాని జతచేశారు. 

ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ గా ఉండగానే బ్రెయిన్ లో ఒక ప్రమాదకరమైన క్లాట్ ని గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసారు. అయితే ఆపరేషన్ విజయవంతం అయినప్పటికీ ఆయన మాత్రం కోలుకోకుండా వెంటిలేటర్ మీదనే ఉన్నారు. ఇలా గతకొన్నిరోజులుగా ఆయనఆరోగ్యం మరింతగా క్షీణించడంతో కొద్దిసేపటి క్రితమే మరణించారు. 

11వ తేదీ నాడు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి ఆయన హెల్త్ బులెటిన్ ని విడుదల చేసింది. ఆయనకు సర్జరీ చేసినప్పటికీ ఆరోగ్యం క్షీణించే ఉందని వారు ప్రకటించారు. ఆ తరువాత కూడా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. 

ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు సేవలందించారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు ఆయన 2009 నుంచి 2012 వరకు ఆర్ధిక మంత్రిగా సేవలందించారు. 2019లో ఆయన కు భారత రత్న ఇచ్చి దేశం గౌరవించింది. 

ఆయన ఆసుపత్రిలో చేరే ముందు, తనకు కరోనా వైరస్ సోకిందని, గత రెండు వారాలుగా తనను కలిసిన వారంతా క్వారంటైన్ అవ్వాలనిఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆయన 2015లో తన భార్యను కోల్పోయారు.