భారత్‌లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించిన జపాన్ రాయబారి హిరోషి సుజుకి.. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన ఓ వీడియోపై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తనదైన శైలిలో ప్రశంసించారు.
న్యూఢిల్లీ: భారతదేశంలోని వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. సంప్రదాయ వంటకాలతో పాటు, నాన్ వెజ్, స్ట్రీట్ ఫుడ్‌కు విశేషమైన ఆదరణ పొందుతుంది. అయితే తాజాగా భారత్‌లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించిన జపాన్ రాయబారి హిరోషి సుజుకి.. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మహారాష్ట్రలోని పుణెలో పర్యటించిన హిరోషి సుజుకి దంపతులు.. వడపావ్‌తో పాటు కొన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ రుచి చూశారు. ఈ క్రమంలోనే భారతీయ స్ట్రీట్ ఫుడ్‌పై ప్రశంసించారు.
భారత దేశంలోని స్ట్రీట్ ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టమని హిరోషి సుజకి చెప్పారు. అయితే కాస్తా మసాలా తగ్గించాలని కోరారు. ఆయన షేర్ చేసిన ఓ వీడియోపై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తనదైన శైలిలో స్పందించారు. భారతదేశపు పాక వైవిధ్యాన్ని ఇంత వినూత్నంగా ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలు చేస్తూ ఉండండి అని కూడా పేర్కొన్నారు. హిరోషి సుజుకి షేర్ చేసిన ఓ వీడియో ఆయన తక్కువ స్పైసీ కావాలని కోరగా.. అతని భార్య మాత్రం హాట్ స్పైసీ కావాలని కోరారు. ఈ క్రమంలోనే తన భార్య తనను బీట్ చేసిందని పేర్కొన్నారు.
ఈ వీడియోపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘‘మిస్టర్ అంబాసిడర్.. మీరు ఓడిపోయినా పట్టించుకోని పోటీ ఇది. మీరు భారతదేశపు పాక వైవిధ్యాన్ని ఆస్వాదించడం, దానిని ఇంత వినూత్న రీతిలో ప్రదర్శించడం చూసి సంతోషిస్తున్నాము. వీడియోలు వస్తూ ఉండనివ్వండి’’ అని ట్వీట్ చేశారు.
ఇక, హిరోషి సుజుకి షేర్ చేసిన వీడియోలో.. హిరోషి సుజుకీ తన భార్యతో కలిసి పావ్ భాజీ, మిసల్ పావ్, వడ పావ్, సాబుదానా వడ మరియు అనేక ఇతర రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కూడా హిరోషి సుజుకీ జంటపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక, గతంలో కూడా హిరోషి సుజుకి.. భారత్‌లోని స్ట్రీట్ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా ఆస్వాదించిన సంగతి తెలిసిందే.
