రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను చేపట్టింది. ఈ ఆపరేషన్ గురించి లోతుగా చర్చిస్తూ హిస్టరీ టీవీ 18 ఓ డాక్యుమెంటరీ తీసింది. డాక్యుమెంటరీ ప్రోమోను ప్రధాని మోడీ పేర్కొంటూ ఓ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: ఆపరేషన్ గంగను అంత సులువుగా మరిచిపోలేం. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య భీకర యుద్ధం ప్రారంభమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ విజయవంతంగా చేపట్టింది. రణ భూమి నుంచి వేలాది మంది భారత విద్యార్థులను వందకు మించి విదేశీయులనూ భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. ఆపరేషన్ గంగ గురించి హిస్టరీ టీవీ 18 ఒక డాక్యుమెంటరీ తీసింది. తాజాగా డాక్యుమెంటరీ ప్రోమోను విడుదల చేసింది. ఆ డాక్యుమెంటరీ ప్రోమోను పేర్కొంటూ ప్రధాని మోడీ ఈ రోజు మధ్యాహ్నం ట్వీట్ చేశారు.
‘ఎంతటి కఠిన సవాలైనా సరే, మన ప్రజల పక్షాన నిలబడి, వారిని ఆదుకోవడంలో మన బలమైన సంకల్పాన్ని ఆపరేషన్ గంగా స్పష్టంగా చూపిస్తుంది. ఇది తిరుగులేని భారత దేశ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పలు కోణాల గురించి మంచి సమాచారాన్ని ఈ డాక్యుమెంటరీ ఇస్తుంది’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
డాక్యుమెంటరీ ప్రోమోను హిస్టరీ టీవీ 18 ట్వీట్ చేస్తూ ఓ వ్యాఖ్య చేసింది. ‘2022 ఫిబ్రవరి 24వ తేదీన వేలాది మంది భారతీయులు ఒక యుద్ధ క్షేత్రంలో చిక్కుకుపోయారు. యుద్ధం మొదలైన రెండు రోజుల్లోనే 21వ శతాబ్దంలోనే అతిపెద్ద వైమానిక తరలింపుల ఆపరేషన్‌ను భారత్ ప్రారంభించింది. 90 ప్రత్యేక విమానాల సహాయంతో 22 వేలకు మించి భారతీయులను, 18 దేశాలకు చెందిన 147 మంది విదేశీయులను తరలించింది. ‘ది ఎవాక్యుయేషన్: ఆపరేషన్ గంగ’ పేరిట రేపు రాత్రి 8 గంటలకు హిస్టరీ టీవీ 18న ప్రసారం అవుతున్న డాక్యుమెంటరీలో ఇన్సైడ్ స్టోరీని చూడండి’ అంటూ పేర్కొంది.
Also Read: ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారత పౌరులను తరలించాం: పార్లమెంటులో కేంద్ర మంత్రి జైశంకర్
ఆ ప్రోమోలో కొన్ని కీలక దృశ్యాలను చూపించారు. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదివి అర్థంతరంగా భారత్‌కు తిరిగి రావల్సిన వచ్చిన కొందరి అనుభవాలను వివరించారు. అప్పటి పరిస్థితులను, వారు గురైన మానసిక ఆందోళనలను దృశ్యమానం చేశారు. అలాగే.. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు ఎస్ జైశంకర్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజులు తాము తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన విషయాల గురించి పంచుకున్నారు.
