మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ‘ప్రెసిడెన్షియల్‌ ఈయర్స్‌ 2012– 2017’ పుస్తకంలో మోడీపై, ఎన్ డీఏ మీద, కాంగ్రెస్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పార్లమెంట్లో తరచుగా మాట్లాడాలని సూచించారు.  ప్రణబ్‌ ముఖర్జీ చనిపోవడానికి ముందు చివరగా రాసిన ఈ పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది. 

పార్లమెంటులో విపక్ష సభ్యుల భిన్నాభిప్రాయాలను ప్రధాని వినాలని, తన అభిప్రాయాలను వివరించి, వారిని ఒప్పించాలని ఆ పుస్తకంలో ముఖర్జీ సూచించారు. ఏ ప్రధానైనా సరే.. సభలో ఉంటే చాలు, సభ నిర్వహణ వేరుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. 

జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ వీరంతా సభలో తమదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ తన పూర్వ ప్రధానుల నుంచి ఈ విషయంలో స్ఫూర్తి పొందాలి. స్పష్టమైన నాయకత్వాన్ని చూపాలి. తన అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు పార్లమెంటును వేదికగా వాడుకోవాలి’ అని సూచించారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో స్వపక్ష, విపక్ష నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ క్లిష్ట సమస్యలను పరిష్కరించేవాడినని వివరించారు. సభ సజావుగా సాగడమే తన ప్రథమ లక్ష్యంగా ఉండేదన్నారు. దురదృష్టవశాత్తూ 2014–19 మధ్య ఎన్డీయే ప్రభుత్వంలో ఈ స్ఫూర్తి కొరవడిందన్నారు. అయితే, విపక్షం కూడా దారుణంగా, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించిందని విమర్శించారు. 

పార్లమెంట్లో గందరగోళం కొనసాగడం వల్ల ప్రభుత్వం కన్నా విపక్షమే ఎక్కువ నష్టపోతుందని తెలిపారు. దీన్ని సాకుగా చూపి సభా సమయాన్ని కుదించే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుందన్నారు. దేశం ప్రధాని పాలనపైనే ఆధారపడి ఉంటుందన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నుడై ఉండే పరిస్థితి మన్మోహన్‌ సింగ్‌దని, దాంతో ఆ ప్రభావం పాలనపై పడిందని ప్రణబ్‌ విశ్లేషించారు.  

‘ప్రధానమంత్రి నర్రేంద మోదీ, నవాజ్‌ షరీఫ్ వ్యక్తిగత కార్యక్రమం కోసం పాకిస్తాన్‌ వెళ్లారు. లాహోర్‌కు వెళ్లడం సరైన నిర్ణయం కాదు. సర్జికల్ స్ట్రైక్‌ అనేది ఆర్మీ సాధారణంగా చేసే ప్రక్రియ మాత్రమే. నాకు అవకాశం ఇస్తే తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేవాడిని. తాను యూపీఏ-2లో ఆర్ధిక మంత్రిగా కొనసాగితే.. మమతా బెనర్జీ కూటమిలోనే కొనసాగేలా చేసేవాడినని,  2004లో నేను ప్రధానినైతే 2014లో... కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైన ఓటమి పాలయ్యేది కాదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. 

నేను రాష్ట్రపతిగా వెళ్లిన తరువాత... కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా అంశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. సోనియాగాంధీ పార్టీని నడపంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. మహారాష్ట్రలో సరైన నాయకులపై కాకుండా ఇతరులపై పార్టీ ఆధారపడింది.’ అని తన  ఆత్మకథ ‘ప్రెసిడెన్షియల్‌ ఈయర్స్‌ 2012– 2017లో పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని అంశాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.