కరోనా మహమ్మారికి టీకా రెడీగా ఉంది. ఇప్పటికే ఫ్రంట్ వారియర్స్ అందరికీ టీకా ఇచ్చారు. కాగా.. రెండో దశలో ప్రధాని నరేంద్రమోదీ తోపాటు.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. రాజ‌కీయ‌వేత్త‌లతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండ‌వ రౌండ్‌లో టీకా తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు.  తొలి ద‌శ‌లో కేవ‌లం ఫ్రంట్‌లైన్‌, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే టీకా వేస్తున్న విష‌యం తెలిసిందే.  దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. బుధ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుమారు 7.86 ల‌క్ష‌ల హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు టీకాలు వేసుకున్న‌ట్లు కేంద్రం పేర్కొన్న‌ది.   

ఇదిలా ఉండగా.. వ్యాక్సిన్ కార్య‌క్ర‌మంలో భారత్‌ రికార్డు స్థాయిలో టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా పంపిణీ ప్రారంభమైన రోజే రెండు ల‌క్ష‌ల మందికి అందించ‌డం ద్వారా ఈ ఘ‌న‌త సాధించామ‌ని, ప్ర‌పంచ దేశాలైన‌ అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో అందించిన వ్యాక్సిన్ల సంఖ్య కంటే ఇది ఎక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహన్ అగ్నాని వెల్లడించారు.