PM Modi In Varanasi: అర్ధరాత్రి వేళ వారణాసి వీధుల్లో ప్రధాని మోదీ.. ఫోటోలు వైరల్..
PM Modi In Varanasi: పార్లమెంట్ ఎన్నికల ముందు కాశీ ప్రజలకు కోట్ల రూపాయల కానుక ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి చేరుకున్నారు. ఇటీవల వారణాసిలో నిర్మించిన శివపూర్-ఫుల్వారియా-లహర్తారా రహదారిని పరిశీలించడానికి అర్ధరాత్రి అక్కడి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
PM Modi In Varanasi: ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ఆకస్మికంగా వచ్చారు. అర్థరాత్రి వేళ తన నియోజకవర్గంలో వీధుల్లో పర్యటించారు. దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో వారణాసిలో ఇటీవల నిర్మించిన శివపూర్-ఫుల్వారియా-లహర్తారా రహదారిని పరిశీలించారు. ఈ సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రధాని మోదీతోనే ఉన్నారు. ప్రధాని మోదీ రాక తెలుసుకున్న అక్కడి ప్రజలు అర్థరాత్రి వేళ బయటకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఉన్న ప్రజలకు ప్రధాని కరచాలనం చేసి అభివాదం చేశారు.ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ మార్గాన్ని ఇటీవల ప్రారంభించారు. వారణాసి విమానాశ్రయం, లక్నో, అజంగఢ్, ఘాజీపూర్ వైపు ప్రయాణించే వారికి ఈ రహదారి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సుమారు 5 లక్షల మంది ప్రజలకు ఈ రహదారి సహాయం చేసింది. రూ. 360 కోట్లతో ఈ మార్గాన్ని నిర్మించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల బి.హెచ్.యు. విమానాశ్రయం నుండి ప్రయాణ దూరం 75 నిమిషాల నుండి 45 నిమిషాలకు తగ్గుతోంది. అదే విధంగా లహర్తర నుంచి కచారికి దూరం 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గుతోంది. వారణాసి పౌరులకు జీవితాన్ని సులభతరం చేయడానికి ఈ రహదారి ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రధాని మోడీ ఆకస్మికంగా సందర్శించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన రోజే.. రాత్రి సుమారు 8:45 గంటలకు కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ ప్రదేశాన్ని ప్రధాని ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు గంటపాటు అక్కడే గడిపిన ఆయన పార్లమెంట్ హౌస్ పనులను నేరుగా పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నాడు తన పార్లమెంటరీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.