80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని డిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన 2047 నాటికి 'వికసిత భారత్' నిర్మాణంలో యువశక్తి పాత్ర కీలక అని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో చరిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. 'వందేమాతరం' గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో తొలిసారిగా 'వందేమాతరం' గీతాన్ని ఆలపించారు. 21 ఫిరంగుల గౌరవ వందనం, త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు.

తన ప్రసంగంలో ప్రధాని మోదీ దేశ యువశక్తి సామర్థ్యాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. 2047 నాటికి భారత్‌ను 'వికసిత భారత్'గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చే ప్రయాణంలో యువత శక్తి, వారి ఆకాంక్షలే కీలక చోదక శక్తిగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థల ('ఫ్రాజైల్ ఫైవ్') జాబితాలో ఉన్న భారత్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది" అని ఆయన గర్వంగా ప్రకటించారు.

YouTube video player

పెద్ద కలలు కనండి, గట్టి సంకల్పం తీసుకోండి!

దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ప్రధాని మోదీ మాట్లాడారు. ఏ దేశమైనా ఉన్నత స్థాయికి చేరాలంటే ఆ దేశ ప్రజల పెద్ద కలలు, బలమైన సంకల్పం, సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. చిన్న చిన్న లక్ష్యాల వెంట పడకుండా, పెద్ద కలలు కనాలని పౌరులకు పిలుపునిచ్చారు. పెద్ద ఆలోచనలు దేశ దృక్పథాన్ని విస్తరింపజేస్తాయని అభిప్రాయపడ్డారు. సవాళ్లు, కష్టనష్టాలు ఎదురైనప్పుడు దృఢమైన నిర్ణయాలు, నిశ్చయాలే దేశానికి కొత్త దారి చూపిస్తాయని పేర్కొన్నారు.

 యువతకు ఏఐ ట్రైనింగ్

యువతను టార్గెట్ గా చేసుకుని ప్రధాని మోదీ ప్రసంగం సాగింది. 'నవ జవాన్ (యువత)' అంటూ ప్రసంగించిన మోదీ వరాలు కురిపించారు. దేశంలోని కోటి మంది యువతకు ఏఐ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక వివిధ పోటీ పరీక్షల కోసం ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

కేవలం చదువులోనే కాదు స్పోర్ట్స్ లో కూడా యువతకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 2036 లో జరిగే ఒలింపిక్స్ కోసం యువతను సన్నద్దం చేస్తున్నామన్నారు.. గతంలో చాలా క్రీడా విభాగాల్లో భారత్ కనీసం అర్హత సాధించేది కాదు.. వచ్చే ఒలింపిక్స్ లో ప్రతి క్రీడలో భారత క్రీడాకారులు ఉండేలా చూస్తామన్నారు. ఇందుకోసమే దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ చేపట్టనున్నట్లు... వారి టాలెంట్ ఆధారంగా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఒలింపిక్స్ కోసం సిద్దం చేస్తామన్నారు. 2039 కామన్వెల్త్ గేమ్స్ ను భారత్ నిర్వహించనుంది... ఇందుకోసం కూడా క్రీడాకారులను సిద్దం చేస్తున్నామన్నారు.

బాధితులకు దేశం అండగా ఉంది

ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రధాని మోదీ తన ప్రసంగంలో భరోసా ఇచ్చారు. "ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం, యావత్ దేశం బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది. వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.

యువత భారీగా హాజరు, ప్రత్యేక అతిథులు

ఈ వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 2,500 మంది బాలుర, బాలికల క్యాడెట్లు, 'మై భారత్' వాలంటీర్లు పాల్గొన్నారు. వీరంతా జ్ఞాన్‌పథ్‌లో కూర్చుని 'వందేమాతరం' అనే అక్షరాల ఆకృతిలో కనిపించారు. అలాగే 'వికసిత్ భారత్@2047' థీమ్‌ను ప్రదర్శించే వ్యూ కట్టర్లను కూడా జ్ఞాన్‌పథ్‌లో ఏర్పాటు చేశారు.

వివిధ రంగాలకు చెందిన సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఈ వేడుకలకు ఆహ్వానించారు. వీరిలో మహిళా పారిశ్రామికవేత్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, యువ ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, చేతివృత్తుల వారు, రైతులు, విద్యార్థులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారు. వీరితో పాటు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,500 మందికి పైగా ప్రజలు తమ సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకలను వీక్షించారు.