ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయనే స్వయంగా తొలి టికెట్‌ను కొనుక్కుని ఈ సంగ్రహాలయాన్ని సందర్శించారు. ఈ ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఇప్పటి వరకు మన దేశానికి ప్రధానిగా సేవలు అందించిన వారి వివరాలు, దేశం ఎదుర్కొన్న సవాళ్లను వారు అదిగమించిన తీరును పొందుపరిచినట్టు అధికారులు వివరించారు.  

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను ప్రారంభించారు. భారత్ స్వాతంత్ర్యం పొందినప్పటి సేవలందించిన ప్రధానమంత్రుల గురించిన వివరాలను ఈ మ్యూజియం ప్రదర్శిస్తుంది. ఈ దేశ 14 మాజీ ప్రధానమంత్రులకు ఈ మ్యూజియాన్ని అంకితం చేశారు. ఈ ప్రధానమంత్రులు దేశ ఉన్నతికి చేపట్టిన విధానాలు, అవలంభించిన మార్గాలు, వారి కృషిని వెల్లడిస్తుంది. ఈ రోజు ప్రధాని మోడీ ఈ ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రారంభించారు. తానే స్వయంగా తొలి టికెట్ కొన్నారు.

స్వాతంత్ర్యం పొందిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు మన దేశం ఎదుర్కొన్న సవాళ్లను మన దేశ ప్రధానమంత్రులు అధిగమించిన వివరాలను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. వారి ప్రయాణాలను వివరించడంతోపాటు దేశ చరిత్రలోని కీలక ఘట్టాలనూ ఈ సంగ్రహాలయం ఆవిష్కరించనుంది. ఎలాంటి వివక్ష లేకుండా ప్రధానమంత్రులు అందరి సేవలను గుర్తించి ప్రదర్శనకు ఉంచనున్నట్టు అధికారులు వెల్లడించారు. వారి భావజాలాలకు, పదవీకాలాలకు అతీతంగా అందరి కృషిని ప్రజల ముందు ఉంచనున్నట్టు తెలిపారు.

ఈ మ్యూజియంలో స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు, దేశ పురోగతికి ఆయన కృషికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పొందిన అనేక బహుమానాలను తొలిసారిగా ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ మ్యూజియంలో 43 గ్యాలరీలు ఉన్నాయి. హోలోగ్రామ్‌లు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్, మల్టీ మీడియా, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్, ఇంటెరాక్టివ్ స్క్రీన్ వంటి నూతన సాంకేతికత సహాయంతో మ్యూజియంలో ప్రదర్శనలు ఆసక్తిగొలిపేలా ఉంటాయి.

దేశ యువతను, కొత్త తరాలను నాయకత్వం వైపు పురికొల్పేలా, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ప్రధాని మోడీ తీసుకున్న కీలక నిర్ణయంగా ఈ సంగ్రహాలయాన్ని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రుల నాయకత్వ, విజన్, వారి విజయాలపైనా అవగాహన పెంపొందించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వివరించింది.

ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సమీపంగా ఉన్న మెట్రో స్టేషన్ ఎల్లో లైన్‌లోని లోక్ కళ్యాణ్ మార్గ్. ఈ మ్యూజియం సందర్శించడానికి టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి. భారత పౌరులకు ఆన్‌లైన్‌లో తీసుకుంటే రూ. 100, ఆఫ్‌లైన్‌లో తీసుకుంటే.. రూ. 110. విదేశీయులకు ఈ టికెట్ ధర రూ. 750. కాగా, విద్యార్థులకు టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. స్కూల్ లేదా కాలేజీ యాజమాన్యం విద్యార్థుల కోసం టికెట్లు కొంటే 25 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఐదు నుంచి 12 ఏళ్ల పిల్లలకు టికెట్‌లపై 50 శాతం తగ్గింపు ఉండనుంది.