నూతన విద్యా విధానం క్రీడలకు సముచిత స్థానాన్ని ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పేదరికాన్ని ఎదుర్కొనే సాధనంగా ఈ విధానాన్ని అభివర్ణించారు. స్థానిక భాషల్లో బోధనకు ఆస్కారమిస్తున్న ఈ విధానం అమల్లోకి వచ్చి ఏడాది నిండిన సంగతి తెలిసిందే. ఇదే కాలంలో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత క్రీడాకారులు ఏడు పతకాలను గెలుచుకున్నారు. స్థానిక భాషల్లో బోధనతో ప్రపంచస్థాయి కార్యక్రమాల్లో భారత పౌరులు ఆటంకాలు ఎదుర్కోవచ్చనే సంశయాలను ఈ పతకాలు పటాపంచలు చేశాయి.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో నూతన విద్యా విధానాన్ని ప్రస్తావించారు. నూతన విద్యా విధానం పేదరికాన్ని నిర్మూలించడానికి ఎక్కుపెట్టిన ఒక అస్త్రమని, 21వ శతాబ్ది అవసరాలను తీర్చే సాధనమని తెలిపారు. స్థానిక భాషల్లోనే బోధనను నూతన విద్యా విధానం ప్రోత్సహిస్తున్నదని వివరించారు. క్రీడలకూ సముచిత స్థానాన్నిచ్చిందని తెలిపారు. నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చి ఇటీవలే ఏడాది నిండిన సంగతి తెలిసిందే. ఇదే కాలంలో భారత్ ఏడు ఒలింపిక్ పతకాలను గెలుచుకోవడం గమనార్హం. నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చినప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారత పౌరులు భాషాసమస్యలను, కమ్యూనికేషన్ ఇబ్బందులు ఎదుర్కోవచ్చనే సంశయాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనతో ఈ భయాందోళనలు తొలగిపోయాయనన్న చర్చ జరుగుతున్నది.

ఇదే ప్రసంగంలో దేశంలోని ట్యాలెంట్‌ను ప్రోత్సహించాల్సిన అవసరముందని ప్రధాని వివరించారు. క్రీడలను ఎంకరేజ్ చేయాలని సూచించారు. ఒకప్పుడు క్రీడలకు భవిష్యత్‌ను నాశనం చేసుకోవడమేనని తల్లిదండ్రులు భావించేవారని అన్నారు. కానీ, టోక్యో ఒలింపిక్స్ విజయాలు పౌరుల్లో కొత్త అవగాహనను తెచ్చాయని వివరించారు. క్రీడలను ప్రొఫెషనల్ కెరీర్‌గా ఎంచుకోవచ్చనే ఆలోచనకు బీజం వేశాయని తెలిపారు. ఇదే సందర్భంలో నూతన విద్యా విధానం క్రీడలకూ తగిన ప్రాధాన్యతనిస్తున్నదని గుర్తుచేశారు. గతంలో క్రీడలను ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీగా పేర్కొనేవారని చెప్పారు. కానీ, నూతన విద్యా విధానంలో క్రీడలను మెయిన్‌స్ట్రీమ్ ఎడ్యుకేషన్‌లోకి తెచ్చామని వివరించారు. జీవితంలో పురోగతి సాధించడానికి క్రీడలు ఒక ప్రభావవంతమైన మార్గమని తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలను సాధించిన సంగతి తెలిసిందే. నీరజ్ చోప్రా స్వర్ణంతోపాటు రెండు కాంస్యం, మరో నాలుగు రజత పతకాలు భారత్‌కు దక్కాయి. వీరంతా వ్యక్తిగతంగా జీవితాల్లో విజయం సాధించడంతోపాటు దేశానికి ప్రేరణనిచ్చారని ప్రధాని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించిన తర్వాత టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన ఇండియన్ కాంటిజెంట్‌ను కలిశారు. ఈ క్రీడాకారులను, ఎన్‌సీసీ క్యాడెట్లను ఆయన అభినందించారు.