ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అభ్యర్థన మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆయనకు గుజరాతీ పేరును పెట్టారు. ఆయనను తులసీభాయ్ అని పిలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అభ్యర్థన మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆయనకు గుజరాతీ పేరును పెట్టారు. గుజరాత్‌లో మూడు రోజుల పాటు జరిగే గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టెడ్రోస్‌తో పాటు మారిషస్ ప్రధాని Pravind Jugnauth కూడా హాజరయ్యారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మిమ్మల్ని(టెడ్రోస్‌) తులసీభాయ్ అని పిలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. తరతరాలుగా భారతీయులు తులసి మొక్కను పూజించారని ప్రధాని మోదీ వివరించారు.

‘‘WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ నాకు మంచి స్నేహితుడు. భారతీయ ఉపాధ్యాయులు చదవు నేర్పించారని, వారి కారణంగా తాను ఇక్కడ ఉన్నానని ఆయన ఎప్పుడూ నాతో చెప్తాడు. 'నేను పక్కా గుజరాతీని అయ్యాను. మీరు నాకు పేరు నిర్ణయించారా? ' అని ఈ రోజు ఆయన నన్ను అడిగాడు. దీంతో నేను ఆయనను గుజరాతీగా తులసీభాయ్ అని పిలిచాను. తులసి అనేది ఆధునిక తరాలు మరచిపోతున్న మొక్క. భారత దేశంలో తరతరాల పాటు తులసిని పూజించారు. మీరు వివాహంలో కూడా తులసి మొక్కను ఉపయోగించవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు మాతో ఉన్నారు’’ అని అన్నారు. 

సాంప్రదాయ వైద్యం కోసం భారత దేశానికి రావాలనుకునే విదేశీ పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక ఆయుష్ వీసా కేటగిరీని ప్రవేశపెడుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయుష్‌ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణల అవకాశాలు అపరిమితంగా ఉన్నాయని ఆయన అన్నారు. ‘‘ఆయుష్ ఔషధాలు, సప్లిమెంట్లు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో అపూర్వమైన వృద్దిని మనం ఇప్పటికే చూస్తున్నాము’’ అని మోదీ చెప్పారు. 

‘‘మేము ఒక ప్రత్యేక ఆయుష్ హాల్‌మార్క్‌ను తయారు చేయబోతున్నాము. ఈ హాల్‌మార్క్ భారతదేశంలో తయారు చేయబడిన అత్యంత నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు వర్తించబడుతుంది’’ అని మోదీ చెప్పారు. ఆయుష్ రంగానికి పెట్టుబడి సదస్సు జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. కోవిడ్ 19 వ్యాప్తి చెందుతున్న సమయంలో తాను దీని గురించి ఆలోచించానని తెలిపారు. ఈ సమయంలో AYUSH Kadaతో పాటు అటువంటి ఉత్పత్తులు ప్రజలు వారి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సహాయపడతాయని చెప్పారు. 

ఇక, టెడ్రోస్ ప్రారంభంలో గుజరాతీలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ మాటలు విన్న మోదీ నవ్వుతూ, చప్పట్టలు కొట్టారు. అంతేకాకుండా తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు అందరికి ఆయన చేతులు జోడించి నమస్కారం పెట్టారు.