ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు 5 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. దీంతో ఒకే రోజు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలెక్కాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు 5 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. దీంతో ఒకే రోజు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు పట్టాలెక్కాయి. ఈరోజు మధ్యప్రదేశ్‌లోని పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. బోపాల్‌లోని కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ రైళ్లను ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను మోదీ భౌతికంగా జెండా ఊపి ప్రారంభించగా.. మిగిలిన మూడు రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈరోజు ఉదయం కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జబల్‌పూర్ వందే భారత్ రైళ్లను జెండా ఊపారు.
మరో మూడు వందే భారత్ రైళ్లు.. మడ్గావ్ (గోవా)-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హతియా-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. ‘‘ఈ రైళ్లు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, జార్ఖండ్‌లలో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి’’ అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు.
ఈ ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ల రూట్ల వివరాలు ఇవే..
రాణి కమలాపతి-జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. మహాకౌశల్ రీజియన్ (జబల్‌పూర్) నుంచి మధ్యప్రదేశ్ సెంట్రల్ రీజియన్ (భోపాల్)కి కలుపుతుంది. అలాగే.. భేరాఘాట్, పచ్మర్హి, సాత్పురా మొదలైన పర్యాటక ప్రదేశాలు కూడా మెరుగైన కనెక్టివిటీ ద్వారా ప్రయోజనం పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే ఈ రైలు దాదాపు ముప్పై నిమిషాల సమయాన్ని ఆదా చేస్తోంది.
ఖజురహో-భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాల్వా ప్రాంతం (ఇండోర్), బుందేల్‌ఖండ్ ప్రాంతం (ఖజురహో) నుంచి సెంట్రల్ రీజియన్ (భోపాల్)కి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఇది మహాకాళేశ్వర్, మండూ, మహేశ్వర్, ఖజురహో, పన్నా వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. రైలు మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలు కంటే దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాల సమయాన్ని ఆదా చేస్తోంది.
మడ్గావ్ (గోవా)-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. గోవా మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, గోవాలోని మడ్గావ్ స్టేషన్ మధ్య నడుస్తుంది. రెండు ప్రదేశాలను కలుపుతున్న ప్రస్తుత వేగవంతమైన రైలుతో పోల్చినప్పుడు.. ఇది ఒక గంట ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.
ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కర్ణాటకలోని ముఖ్యమైన నగరాలు.. ధార్వాడ్, హుబ్బల్లి, దావణగెరెలను రాష్ట్ర రాజధాని బెంగళూరుతో కలుపుతుంది. ఈ ప్రాంతంలోని పర్యాటకులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మొదలైన వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే ఈ రైలు దాదాపు ముప్పై నిమిషాల సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.
హతియా-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. జార్ఖండ్, బీహార్‌లకు మొదటి వందే భారత్. పాట్నా, రాంచీల మధ్య కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా.. ఈ రైలు పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు వరంగా మారనుంది. రెండు ప్రదేశాలను కలుపుతున్న ప్రస్తుత వేగవంతమైన రైలుతో పోల్చినప్పుడు ఇది ఒక గంట ఇరవై ఐదు నిమిషాల ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.
