ఆయన మరణం నన్ను బాధిస్తోంది.. ములాయం సింగ్ యాదవ్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం..
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ.. భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ.. భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు. ‘‘ములాయం సింగ్ యాదవ్‌ది ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయన ప్రజల సమస్యల పట్ల సున్నితంగా ఉండేవారు. నిరాడంబరమైన నాయకుడిగా విస్తృతంగా ప్రశంసించబడ్డారు. ఆయన శ్రద్ధతో ప్రజలకు సేవ చేశారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, డాక్టర్ లోహియాల ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి తన జీవితాన్ని అంకితం చేశారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
‘‘ములాయం సింగ్ యాదవ్.. ఉత్తరప్రదేశ్‌తో పాటు జాతీయ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం కోసం ఆయన కీలక సైనికునిగా ఉన్నారు. రక్షణ మంత్రిగా, బలమైన భారతదేశం కోసం పనిచేశారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు తెలివైనతో కూడుకున్నవి. జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా ఉండేవి. మేము ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు ములాయం సింగ్ యాదవ్‌తో నేను చాలా సంప్రదింపులు జరిపాను. సాన్నిహిత్యం కొనసాగింది. ఆయన అభిప్రాయాలను వినడానికి నేను ఎప్పుడూ ఎదురుచూసేవాడిని. ఆయన మరణం నన్ను బాధిస్తోంది. ఆయన కుటుంబానికి, లక్షలాది మంది మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం. శాంతి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్స్ చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. చాలా రోజులుగా ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ములాయం సింగ్ యాదవ్ మరణవార్తను ఆయన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. ‘‘నా గౌరవనీయమైన తండ్రి, అందరి నాయకుడు ఇక లేరు’’ అని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.