అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిదెన్  ప్రమాణస్వీకారం చేయనున్న విషయం మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కౌంటింగులో నిన్న రాత్రి బైడెన్ అధికారికంగా విజయం సాధించినట్టు ప్రకటించారు. 

బైడెన్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు వార్త వెలువడగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ బైడెన్ తోపాటు, వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమల హారిస్ కి కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

గతంలో వైస్ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు సైతం భారత్ తో సంబంధాలను బలపర్చడానికి చేసిన కృషి అమోఘం అని, ఇప్పుడు కూడా అమెరికా భారత్ బంధాలను మరింత బలపరిచి, ఇరు దేశాల మైత్రిలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించడానికి వేచి చూస్తున్నట్టుగా మోడీ పేర్కొన్నారు. 

ఇక మరో ట్వీట్ లో కమల హారిస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ... హారిస్ విజయం యావత్ భారతీయ అమెరికన్లకు గర్వకారణమని, భారత్, అమెరికాల మైత్రి మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం బైడెన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ... అమెరికాను ఏకం చేస్తూ, మార్గదర్శకత్వాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నారు.