Asianet News TeluguAsianet News Telugu

కృష్ణంరాజు మరణం కలచివేసింది: కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ సానుభూతి

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

PM Modi Condolence On death of Tollywood Actor Krishnam Raju
Author
First Published Sep 11, 2022, 1:01 PM IST

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు మరణం కలచివేసిందని పేర్కొన్నారు. రాబోయే తరాలు ఆయన నటనా కౌశలాన్ని, సృజనాత్మకతను స్మరించుకుంటాయని అన్నారు.  సమాజ సేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు మోదీ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. కృష్ణం రాజు ఫ్యామిలీ తనను కలిసిన సమయంలో దిగిన ఫోటోను మోదీ షేర్ చేశారు. 

ఇక, గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు కన్నుమూశారు. పోస్ట్ కోవిడ్, కార్టియాక్ అరెస్ట్‌తో ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. కృష్ణంరాజు మరణవార్త టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, సినీ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. సినిమాపై మక్కువతో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. 1966లో విడుదలైన చిలకా గోరింకా చిత్రంతో  వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత రెండో తరం స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. కెరీర్ లో 187 చిత్రాల్లో నటించిన కృష్ణం రాజు చివరిగా రాధే శ్యామ్ మూవీలో నటించారు. తన తమ్ముడు కుమారుడు ప్రభాస్ ని నటవారసుడిగా పరిశ్రమకు పరిచయం చేశాడు. కృష్ణంరాజు మరణవార్త విన్న టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

 

బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, తల్లీ కొడుకులు, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తాండ్ర పాపారాయుడు, మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, బావా బావమరిది లాంటి సినిమాలు  ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. భక్త కన్నప్ప టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. శివ భక్తుడిగా కృష్ణం రాజు నటన అబ్బురపరిచింది. కృష్ణంరాజు 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. 

Also Read: అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశం..

మరోవైపు కృష్ణం రాజు  రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీతో యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 1998‌లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత 1999లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన మరోసారి బీజేపీలో చేరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios