కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. ప్రధాని మోదీ ఆగ్రహం

కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని, భారతీయ దౌత్యవేత్తలకు వచ్చిన బెదిరింపులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. న్యాయం జరగాలని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని కెనడాకు హితవు పలికారు.

 

PM Modi condemns Hindu temple attack and diplomat threats in Canada GVR

న్యూ ఢిల్లీ: భారత్- కెనడా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని, భారతీయ దౌత్యవేత్తలకు వచ్చిన బెదిరింపులను ఆయన తీవ్రంగా ఖండించారు. న్యాయం జరగాలని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని కెనడాకు హితవు పలికారు. 

కెనడాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన దౌత్యవేత్తలను బెదిరించే ప్రయత్నాలు కూడా దారుణమైనవి. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ సంకల్పాన్ని ఎప్పటికీ బలహీనపరచలేవు. కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని, చట్టాన్ని పాటిస్తుందని మేము ఆశిస్తున్నాం’ అని ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.

 

అటు, భారత విదేశాంగ శాఖ సైతం కెనడాలో ఆలయంపై దాడిని ఖండించింది. భారత ప్రభుత్వం ఈ దాడిని ఖండిస్తోందని, కెనడాలోని అన్ని ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని పేర్కొంది. ఈ బాధ్యత కెనడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. 

కాగా, కెనడాలోని బ్రాంప్టన్‌లోని ఓ దేవాలయంలో ఆదివారం ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. హిందూ భక్తులపైనా దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం ఈ దాడిని ఖండించారు. ఇలాంటి హింసను ఏమాత్రం సహించబోమని తెలిపారు. ‘బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిరంపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కెనడాలో ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది’ అని ట్రూడో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.... కెనడాలోని ప్రవాస భారతీయుల్లో ఆందోళన నెలకొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios