గుజరాత్‌లో మోర్బీలో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గుజరాత్‌లో మోర్బీలో మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోదీ మంగళవారం కేబుల్ బ్రిడ్జి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై మోర్బీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉంటూ వారికి అన్ని విధాలా సహాయం అందేలా చూడాలని ప్రదాని మోదీ అధికారులకు సూచించారు. 

ఈ సమావేశం సందర్భంగా.. కేబుల్ బ్రిడ్జి ప్రమాదం చోటుచేసున్న అనంతరం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్, బాధితులకు అందించిన సహాయాన్ని అధికారులు ప్రధానికి వివరించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాలను గుర్తించే వివరణాత్మకమైన, విస్తృతమైన విచారణను నిర్వహించడం ప్రస్తుతం ఆవశ్యకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విచారణలో వెలుగుచూసే విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. 

Also Read: మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నవారికి పరామర్శ

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మంత్రులు హర్ష్ సంఘ్వీ, బ్రిజేష్ మెర్జా, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, స్థానిక కలెక్టర్, ఎస్పీ, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు.. మోర్బీకి చేరుకున్న ప్రధాని మోదీ కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రమాదస్థలిని సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేబుల్ బ్రిడ్జి ప్రమాదం అనంతరం రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌లో పాల్గొన్న వ్యక్తులను ప్రధాని మోదీ కలిశారు. వారితో కాసేపు మాట్లాడారు. మోర్బీలోని సివిల్ ఆసుపత్రికి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ బ్రిడ్జి కూలిన ఘటనలో గాయపడి చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన ప్రధాని మోదీ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే బ్రిడ్జిలో కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. 

ఇదిలా ఉంటే..మోర్బీ పట్టణంలో బ్రిటీష్ కాలం నాటి సస్పెన్షన్ బ్రిడ్జి కూలి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 135కి చేరింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత వంతెన నిర్వ‌హ‌ణ‌, సాంకేతిక లోపాలు వెలుగులోకి వ‌చ్చాయి. గ‌ల్లంతైన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా పోలీసులు మాట్లాడుతూ.. మోర్బీ వంతెన సాంకేతిక, నిర్మాణ లోపాలు, కొన్ని మెయింటెనెన్స్ సమస్యలే ప్రాథమికంగా విషాదానికి కారణమని తెలిపారు. ఆ విషాద ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు 9 మందిని అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో తక్షణమే జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.