Asianet News TeluguAsianet News Telugu

PM Modi birthday: 73 వ వసంతంలో అడుగుపెడుతున్న ప్రధాని .. దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు..

PM Modi birthday: ప్రధాని నరేంద్ర మోదీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రధాని మోడీ కూడా తన పుట్టినరోజున న్యూఢిల్లీలోని ద్వారకలో 'యశోభూమి'గా పిలిచే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసిసి) మొదటి దశను మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజును బీజేపీ ఎలా జరుపుకుంటుందో తెలుసుకుందాం...

PM Modi birthday bjp planned events nationwide celebrations KRJ
Author
First Published Sep 17, 2023, 6:13 AM IST

PM Modi birthday: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (సెప్టెంబర్ 17) 73వ ఏట అడుగుపెట్టనున్నారు. ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించేందుకు బీజేపీ ప్రత్యేక సన్నాహాలు చేసింది. విశ్వకర్మ జయంతి కూడా ప్రధాని మోదీ పుట్టినరోజునే. ఈ సందర్భంగా విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ప్రధాని మోదీ పుట్టినరోజును బీజేపీ ఎలా జరుపుకుంటుందో తెలుసుకుందాం...

దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు
 
ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2, 2023 వరకు దేశవ్యాప్తంగా 'సేవా పఖ్వాడా' కింద వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీజేపీ తన అధికారిక హ్యాండిల్ నుండి పోస్ట్ చేసింది. బిజెపి ప్రకారం.. సేవా పఖ్వాడా కింద సెప్టెంబర్ 17 నుండి 24 వరకు 'ఆయుష్మాన్ భవ వారోత్సవాలు' జరుపుకుంటారు. ఇందులో అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించబడతాయి. దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఆయుష్మాన్ యోజన కింద పేదలకు ఇ-కార్డులు పంపిణీ చేయబడతాయి. అదే సమయంలో అక్టోబరు 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక స్వచ్ఛతా ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రారంభం 

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి అర్జున్ ముండా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రాంచీ లో ఈ పథకం ప్రారంభించనున్నారు. రాంచీలోని మొరాబాదిలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తారు.

ప్రధాని మోదీ కార్యచరణ  

ప్రధాని మోడీ తన పుట్టినరోజుకు ఒక రోజు ముందే..సెప్టెంబర్ 17 న చేయబోయే పని గురించి సోషల్ మీడియా X లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 17 ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ద్వారకలో ఏర్పాటు చేసిన అత్యాధునికమైన, ఆధునిక కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) అయిన 'యశోభూమి' ఫేజ్-1ని ప్రధాని మోడీ ప్రారంభిస్తాను. ఇది సమావేశాలకు చాలా ప్రసిద్ధ వేదిక అవుతుందని తాను భావిస్తున్నాననీ, ఇది ప్రపంచం నలుమూలల నుండి ప్రతినిధులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. దీనితో పాటు.. కొత్త మెట్రో స్టేషన్ 'యశోభూమి ద్వారకా సెక్టార్ 25'ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. ఇది ఎక్స్‌పో సెంటర్‌ను ఢిల్లీ మెట్రో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌కు కలుపుతుంది.

ఇండియా గేట్ వద్ద మొక్కలు నాటడం 

ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం 10 గంటలకు ప్రసిద్ధ ఇండియా గేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. రాజ్యసభ ఎంపీ అరుణ్‌సింగ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ఎంపీ ధల్‌సింగ్ బిసెన్, ఎంపీ మహేంద్ర సింగ్ సోలంకి, ఎంపీ దుర్గాదాస్, ఎంపీ పీఎల్ కోల్, రాజ్యసభ ఎంపీ సమ్మర్ సింగ్ సోలంకి, రాజ్యసభ ఎంపీ సుమిత్రా వాల్మీకి, బీజేపీ సీనియర్ నేత కరణ్ సింగ్, ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త సకురామ్ హాజరవుతారు. ఇండియా గేట్ వద్ద ప్రధాని మోదీ పుట్టినరోజును జరుపుకుంటారు.

దర్గా హజ్రత్ నిజాముద్దీన్ వద్ద సామూహిక ప్రార్థనలు 

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని దర్గా హజ్రత్ నిజాముద్దీన్‌లో ఉదయం 11 గంటలకు ఆయన దీర్ఘాయువు, మెరుగైన ఆరోగ్యం కోసం సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ కూడా పాల్గొంటారు.

'రన్ ఫర్ స్వచ్ఛ్ భారత్' మారథాన్ రేస్

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ దర్శన్ ఉపాధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ఉదయం 7 గంటలకు 10 కిలోమీటర్ల ‘రన్ ఫర్ స్వచ్ఛ్ భారత్’ మారథాన్ రేసును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మారథాన్ రేసు రాజ్‌ఘాట్ సమీపంలోని గాంధీ దర్శన్ నుండి ప్రారంభమై కన్నాట్ ప్లేస్ మీదుగా సాగుతుంది.  

అలాగే.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను చైతన్యవంతం చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. హిందూస్థాన్ నివేదిక ప్రకారం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజనతో సహా వివిధ పథకాల లబ్ధిదారులను 25 నుండి 50 సమూహాలుగా సేకరిస్తామని బిజెపి కార్యాలయ కార్యదర్శి శివశక్తి నాథ్ బక్షి శుక్రవారం (సెప్టెంబర్ 15) తెలియజేశారు. ఈ లబ్ధిదారులు ప్రధాని మోదీ దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు.

అలాగే.. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా నేడు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (RML) హాస్పిటల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో దేశంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ OPD (ఔట్ పేషెంట్ విభాగం) ప్రారంభించబడుతుంది. లింగమార్పిడి సంఘంతో సమన్వయం చేయడానికి ఢిల్లీకి చెందిన సేవా భారతి కోఆర్డినేటర్లు కార్యక్రమంలో ఉంటారు. రక్తదాన శిబిరం కూడా నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని RML హాస్పిటల్ డైరెక్టర్ , మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా ప్రారంభిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios