PM Modi At Naval Seminar: న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఐఐఓ) నిర్వహించిన 'స్వావలంబన్ అనే సెమినార్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. రక్షణరంగంలో నూతన ఆవిష్కరణలు రావాలని ఆశించారు.
PM Modi At Naval Seminar: న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో సోమవారం జరిగిన నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఐఐఓ) నిర్వహించిన 'స్వావలంబన్' సెమినార్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడూతూ.. 21వ శతాబ్దపు భారతదేశానికి రక్షణరంగంలో ఆత్మనిర్భర్త చాలా కీలకమనీ, వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి నేవీ కోసం 75 స్వదేశీ సాంకేతికతలను రూపొందించడం మొదటి అడుగు అని, మనం 100 ఏళ్లు స్వాతంత్ర వేడుకలు సమయానికి భారతదేశ రక్షణను అపూర్వమైన శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు.
మనం సాధారణ ఉత్పత్తుల కోసం కూడా విదేశాలపై ఆధారపడే అలవాటును పెంచుకున్నామనీ, మాదకద్రవ్యాల బానిసల మాదిరిగానే, విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులకు బానిసలయ్యామని ప్రధాన మంత్రి తెలిపారు.
భారత నౌకాదళంలో స్వదేశీ సాంకేతికతల వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా కసరత్తు జరగాలని అన్నారు. NIIO, డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (DIO) సహకారంతో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కనీసం 75 వినూత్న స్వదేశీ సాంకేతికత ఉత్పత్తులను భారత నౌకాదళంలోకి చేర్చాలని అన్నారు.
ఇషాపూర్ రైఫిల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన హోవిట్జర్లు, మెషిన్ గన్‌లు అత్యుత్తమమైనవిగా పరిగణించబడుతున్నాయనీ, భారీ సంఖ్యలో ఎగుమతి చేసేవాళ్ళమని అన్నారు. కానీ ఒక సమయంలో.. మనం ఈ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా మారడం ఏమిటి? స్వాతంత్ర్యానికి ముందు కూడా భారత రక్షణ రంగం చాలా పటిష్టంగా ఉండేదని ప్రధాని మోదీ అన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు.. దేశంలో 18 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయనీ, ఇక్కడ ఫిరంగి తుపాకీలతో సహా అనేక రకాల సైనిక పరికరాలు మన దేశంలో తయారు చేయబడ్డాయనీ, రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ రక్షణ పరికరాల ముఖ్యమైన సరఫరాదారుగా ఉండేదని అన్నారు.
మా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలను వివిధ రంగాల్లో నిర్వహించడం ద్వారా వాటికి కొత్త బలాన్ని అందించామని ఆయన అన్నారు. రక్షణ పరిశోధన, ఆవిష్కరణలతో ఐఐటీల వంటి ప్రధాన సంస్థలను ఎలా అనుసంధానిస్తామో నిర్ధారిస్తున్నామని అన్నారు.
అనంతరం ఈ సెమినార్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. అనేక రంగాలలో స్వావలంబనను సాధించాం, దాని కారణంగా.. ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని అన్నారు. 'ఆత్మ నిర్భర్ అభియాన్' కింద, నేవీ 64% పైగా ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ సేకరణ కోసం మూలధన బడ్జెట్ కంటే ఈ ఏడాది 70% వరకు పెరుగుతుందని అన్నారు.
రక్షణ రంగంలో స్వావలంబన సాధించడంలో భారతీయ వ్యాపార, విద్యావేత్తలను భాగస్వామ్యం చేసేందుకు ఈ సదస్సు ఉద్దేశించబడింది. రెండు రోజుల సదస్సులో వ్యాపారం, విద్యావేత్తలు, నిపుణులను ఒక భాగస్వామ్య వేదికపైకి తీసుకువచ్చి, రక్షణ రంగానికి సంబంధించిన సలహాలు, ఆలోచనలు పంచుకున్నారు. ఆవిష్కరణలు, స్వదేశీకరణ, ఆయుధాలు, యుద్ద విమానాలపై సెషన్‌లు జరిగాయి.
