ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న తన 70వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. నిన్న ప్రధాని పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశ విదేశాల నుంచి ఆయనకు మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. 

తన జన్మదినోత్సవం నాడు తనకు ఏ గిఫ్ట్ కావలి అంటూ పలువురు ప్రశ్నించారని, మన ధరిత్రిని ఆరోగ్యంగా ఉంచడమే తనకు ప్రజలిచ్చే గొప్ప గిఫ్ట్ అని మోడీ అభివర్ణించారు. ట్విట్టర్ వేదికగా నిన్న రాత్రి ప్రధాని మోడీ తన కోరికను బయటపెట్టారు. 

"నాకేం కావాలని పలువురు అడిగారు. నాకు ఈ సమయంలో కావలిసినావి ఇవీ" అంటూ కొన్ని విషయాలను చెప్పారు ప్రధాని మోడీ. "మాస్కును అందరూ విధిగా సరైన రీతిలో ధరించడం, రెండు గజాల దూరాన్ని పాటిస్తూ సోషల్ డిస్టెంసింగ్ ను పాటించడం, జనసమ్మర్ధమైన ప్రదేశాలకు వెళ్ళకపోవడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, మన ధరిత్రిని ఆరోగ్యంగా ఉంచడం" అని ప్రధాని మోడీ సెలవిచ్చారు. 

ఇక నిన్న రాత్రి పొద్దు పోయాక ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "నమ్మకమైన మిత్రుడు, గొప్ప నేతకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్రంప్ ట్వీట్ చేసారు. ప్రధాని మోడీ కూడా ట్రంప్ కి ధన్యవాదాలు తెలిపారు.