న్యూఢిల్లీ: కరోనా తర్వాత ప్రపంచం మొత్తం మారిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 100 ఏళ్లలో ఈ తరహా  అంటువ్యాధి సంభవించలేదన్నారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రస్తుతం అన్ని దేశాలు కలిసి పోరాటం చేస్తున్నాయన్నారు. బుద్దపూర్ణిమను పురస్కరించుకొని  బుధవారం నాడు  ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. 

నిస్వార్ధంగా సేవ చేస్తున్న ఫ్రంట్‌లైన్ హెల్త్ కేర్ కార్మికులు, వైద్యలు, నర్సులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హెల్త్ వర్కర్లకు మరోసారి తాను నమస్కరిస్తున్నట్టుగా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రాణాలను కూడ ఫణంగా పెట్టి హెల్త్ వర్కర్లు పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. కరోనాతో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, అంటువ్యాధిని ఓడించేందుకు వ్యాక్సిన్ కచ్చితంగా ముఖ్యమైన ఆయుధమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 50 మంది ప్రముఖ బౌద్ద మత గురువులు బుద్ద పూర్ణిమను పురస్కరించుకొని తమ సందేశాన్ని విన్పించారు. బుద్దుడి గొప్ప ఆదర్శాలను మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీటిని ఆచరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.