2019 నుంచి ప్రధాని మోడీ 21 విదేశీ పర్యటనలు, రూ. 22 కోట్ల ఖర్చులు: రాజ్యసభలో కేంద్రం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2019 నుంచి 21 విదేశీ పర్యటనలు చేశారు. ఈ పర్యటనలకు రూ. 22 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రపతి ఎనిమిది పర్యటనలు చేయగా.. విదేశాంగ మంత్రి 86 పర్యటనలు చేశారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019 నుంచి 21 విదేశీ పర్యటనలు చేశారు. వీటికి రూ. 22.76 కోట్లు ఖర్చు అయినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాష్ట్రపతి ఎనిమిది పర్యటనలు చేశారు. అందుకు రూ. 6.24 కోట్లు ఖర్చు జరిగినట్టు తెలిపింది. అలాగే, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి పర్యటనలకు రూ. 20.87 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై 2019 నుంచి రూ. 22,76,76,934 ఖర్చు జరిగినట్టు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి విదేశీ పర్యటనలపై రూ. 6,24,31,424 ఖర్చు జరిగినట్టు వివరించారు. విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ 2019 నుంచి 86 విదేశీ పర్యటనలు చేసినట్టు తెలిపారు. ఈ పర్యటనలకు గాను రూ. 20,87,01,475 ఖర్చయినట్టు పేర్కొన్నారు.
2019 నుంచి ప్రధాని మోడీ మూడు సార్లు జపాన్ పర్యటించారు. అమెరికా, యూఏఈలకు రెండు సార్లు వెళ్లి వచ్చారు. కాగా, రాష్ట్రపతి 2019 నుంచి ఎనిమిది ట్రిప్పులు వేశారు. ఇందులో ఏడు పర్యటనలు రామ్‌నాథ్ కోవింద్ చేశారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక పర్యటన చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యూకే పర్యటించారు.