టీమిండియాను చూసి మనమందరం నేర్చుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సిరీస్ లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ఎన్నో స‌వాళ్ల మ‌ధ్య అనుభ‌వం లేని టీమిండియా చ‌రిత్ర సృష్టించింద‌ని, ఇండియా కూడా ఇలాంటి స్ఫూర్తితోనే ముందడుగు వేయాల‌ని పిలుపునిచ్చారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో దేశ ప‌రిస్థితిని, అనుభ‌వం లేని ఇండియ‌న్ టీమ్ గెలిచిన తీరును పోలుస్తూ మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అస్సాంలోని తేజ్‌పూర్ యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌ను ఉద్దేశించి మోదీ శుక్ర‌వారం ప్ర‌సంగించారు. 


మ‌న క్రికెట్ టీమ్‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోండి. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న‌ది. మ‌నం దారుణంగా ఓడిపోయాం. అయినా క‌ఠిన స‌వాళ్ల‌ను ఎదురిస్తూ మ‌ళ్లీ విజ‌యం సాధించాం. వాళ్ల‌కు అనుభ‌వం లేదు. అయినా ఆత్మ‌విశ్వాసానికి మాత్రం కొద‌వ లేదు. చివ‌రికి వాళ్లే చ‌రిత్ర సృష్టించారు. క్రికెట్ స‌క్సెస్ మ‌న‌కు పెద్ద జీవిత పాఠం. మ‌నం మ‌న మైండ్‌సెట్‌ను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంచుకోవాలి అని ప్ర‌ధాని అన్నారు.

సానుకూల ఫ‌లితాలు రావాలంటే సానుకూల మైండ్‌సెట్‌ను క‌లిగి ఉండాల‌ని, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ సారాంశం అదే అని మోదీ స్ప‌ష్టం చేశారు. క‌రో వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా చాలా భ‌య‌ప‌డ్డారు. కానీ దేశం ఆ స‌వాలును స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న‌ది. మేడిన్ ఇండియా ప‌రిష్కారాల‌తోనే కొవిడ్‌తో పోరాడాము అని మోదీ అన్నారు. మ‌న సైంటిస్టుల‌పై మ‌నం చూపిన విశ్వాసం వ‌ల్లే వ్యాక్సిన్లు సాధ్య‌మ‌య్యాయ‌ని చెప్పారు.