Asianet News TeluguAsianet News Telugu

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ఇజ్జత్ పోతే ప్రాణం పోయినట్టే: సీజేఐకి బెంగాల్ సీఎం మమతా విజ్ఞప్తి

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌కు నేరుగా కొన్ని విజ్ఞప్తులు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తీర్పు రావడానికి ముందే ఎన్నో విషయాలు జరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇజ్జత్ తీసేస్తున్నారని, ఇజ్జత్ తీస్తే.. ప్రాణాలు పోయినట్టేనని వివరించారు.
 

please save democracy west bengal cm mamata banerjee urges supreme court cji uu lalit
Author
First Published Oct 30, 2022, 4:01 PM IST

కోల్‌కతా: ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్‌ను కోరారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే మన దేశం అధ్యక్ష ప్రభుత్వం రూపం తీసుకుంటుందని అన్నారు. అందుకే దేశ ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య నిర్మాణాన్ని కాపాడాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూయూ లలిత్‌ను కోరారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ హాజరయ్యారు. అదే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మమతా బెనర్జీ.. ఆయన సమక్షంలో న్యాయవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వేధింపుల నుంచి ప్రజలను రక్షించాలని ఆమె సీజేఐకి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య అధికారాలను కొంత మంది దగ్గర మాత్రమే కేంద్రీకృతమై ఉన్నదని ఆరోపించారు. అలాంటప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడున్నది? దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ కామెంట్ చేశారు. మీడియా పక్షపాతాన్ని ఆమె ప్రస్తావించారు. వారు ఎవరినైనా దూషించవచ్చునా? ఎవరి మీదైనా నిందలు వేయవచ్చునా? అని ప్రశ్నించారు. సర్.. తమకు అన్నీ ఇజ్జత్ అని వివరించారు. ఇజ్జత్ తీశారంటే.. మొత్తం మమ్మల్ని హరించినట్టే అని పేర్కొన్నారు.

తీర్పు రాకముందే అనేక విషయాలు జరిగిపోతున్నాయని ఆమె పేర్కొన్నారు. తాను ఈ మాట అంటున్నందుకు మన్నించాలని అన్నారు. తన మాటలు తప్పు అని భావిస్తే క్షమించాలని తెలిపారు.

Also Read:  ’ బెంగాల్ ను విభజించే ప్రశ్నే లేదు..ఎట్టి పరిస్థితిలోనూ దానిని అనుమతించాం ’

ఎన్‌యూజేఎస్ ప్రపంచంలోనే ముఖ్యమైన సంస్థల్లో ఒకటి అని పేర్కొన్నారు. ప్రస్తుత సీజేఐ పాత్ర కూడా గొప్పదని వివరించారు. రెండు నెలల్లోనే జ్యూడీషియరీ అంటే అర్థమేమిటో చూపించారని తెలిపారు. 

న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిందని తాను చెప్పడం లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ, పరిస్థితులు దారుణంగా దిగజారిపోతున్నాయని తెలిపారు. అన్యాయం నుంచి న్యాయవ్యవస్థనే ప్రజలను కాపాడాలని కోరారు. వారి బాధలు వినాలని వివరించారు. ఇప్పుడు ప్రజలు తలుపులు వేసుకుని రోధిస్తున్నారని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios