Asianet News TeluguAsianet News Telugu

నా భర్త ‘వర్క్ ఫ్రమ్ హోం’ చేస్తే విడాకులు తప్పవు! దయచేసి.. ఆ భార్య లెటర్ వైరల్

తన భర్తకు వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని చాలించి వెంటనే ఆఫీసుకు పిలవాలని ఆయన బాస్‌కు భార్య రాసిన ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రోజుకు పదిసార్లు కాఫీ తాగుతూ, రెండూ మూడు గదులను చెత్తకుప్పలుగా మారుస్తూ తరుచూ తిండి కోసం వేధిస్తూ ఇంటిలో అల్లకల్లోలం సృష్టిస్తారని భర్తపై ఆరోపించారు. వెంటనే ఆయనను ఆఫీసుకు పిలవాలని లేదంటే తమ బంధం ఎక్కువ కాలం నిలవదని లెటర్ రాశారు.
 

please call my husband to office from work from home mode wifes letter to boss going viral
Author
New Delhi, First Published Sep 11, 2021, 8:30 PM IST

న్యూఢిల్లీ: కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోం సాధారణమైన విషయంగా మారింది. కరోనా కట్టడికి, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘వర్క్ ఫ్రమ్ హోం’ విధానం ప్రాచుర్యం పొందింది. తద్వారా ఉద్యోగులు ఇంటిలోనే ఉండటంతో కుటుంబ సభ్యుల పక్కనే ఉంటూ పనిచేసుకోవడం వీలైంది. కానీ, ‘వర్క్ ఫ్రమ్ హోం’తో కొత్త చికాకులు వచ్చాయని ఓ ఉద్యోగి భార్య భర్త బాస్‌కు రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. అనుకున్నదానికంటే ఎక్కువగా దీనిపై చర్చ జరుగుతున్నది. అనేకులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఆ లెటర్‌ను బిజినెస్ టైకూన్ హర్ష గోయెంకా ట్వీట్ చేశారు.

ఆ లెటర్ సారం ఇలా ఉన్నది. ‘డియర్ సార్. నేను మీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మనోజ్ భార్యను. దయచేసి ఆయనను ఆఫీసులోనే పనిచేసుకోవడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. అన్ని కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తారు’ అని ఆమె వేడుకున్నారు. అంతేకాదు, ‘ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోం ఇలాగే కొనసాగితే మా వివాహ బంధం కచ్చితంగా నిలువదు. ఆయన రోజుకు పదిసార్లు కాఫీ తాగుతున్నాడు. వేర్వేరు గదుల్లో కూర్చుండి చెత్తకుప్పలా తయారుచేస్తున్నాడు. ఎప్పుడూ తినడానికి ఏదోటి అడుగుతూనే ఉన్నాడు. ఒక్కోసారి వర్క్ కాల్స్ మాట్లాడుతూనే ఆయన నిద్రపోతుండటాన్ని చూశాను’ అని ఆరోపించారు.

 

తమకు ఇద్దరు పిల్లలున్నారని, వారి బాగోగులు చూడటానికే తనకు సరిపోతున్నదని వివరించారు. కాబట్టి, దయచేసి తన భర్తకు వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని బంద్ చేసి ఆఫీసుకు పిలవాల్సిందిగా అభ్యర్థించారు. తద్వారా తన మానసిక ఆరోగ్యాన్ని మళ్లీ పొందటానికి సహకరించాల్సిందిగా కోరారు.

ఈ లెటర్‌ను హర్ష గోయెంకా ట్వీట్ చేస్తూ.. ఆమె విజ్ఞప్తికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఆ ట్విట్టర్ థ్రెడ్‌పై బీభత్సమైన చర్చ జరుగుతున్నది. ఒక్కొక్కరు తమ తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇది కేవలం పెళ్లి చేసుకున్న జంటలకే కాదు, కుటుంబంలోనూ సమస్యగానే మారిందని ఇంకొందరు ట్వీట్ చేశారు. గతేడాది నుంచి తమ ఇంట్లోనూ ఇదే పరిస్థితి అని ఇంకొకరు ఆరోపించారు. మరొకరు ఆమె లేఖకు మద్దతు పలుకుతూ సదరు ఉద్యోగినిక ఆఫీసుకు పిలవాల్సిందిగా ఆయనకు సూచన చేశారు. మరికొందరు జోకులు పేలుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios