రాజ్యసభలో లీడర్ ఆఫ్ ది హౌస్‌గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌‌ను బీజేపీ అధిష్టానం నియమించింది. థావర్ చంద్ గెహ్లాట్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించడంతో రాజ్యసభలో బీజేపీ పక్షనేత లేరు. 

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధిష్టానం మరో కీలక బాధ్యతను కట్టబెట్టాయి. రాజ్యసభలో లీడర్ ఆఫ్ ది హౌస్‌గా పీయూష్ గోయల్‌ను నియమిస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. అయితే లోక్‌సభలో అధిర్ రంజన్ చౌదరి స్థానంలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

థావర్ చంద్ గెహ్లాట్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించడంతో రాజ్యసభలో బీజేపీ పక్షనేత లేరు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వర్తిస్తున్న పీయూష్ గోయల్‌ 2010 నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. గత రెండేళ్లుగా వివిధ బిల్లుల ఆమోదం విషయంలో కాంగ్రెస్‌ సహా వైఎస్ఆర్‌సీపీ, ఏఐడీఎంకే, బీజేడీ వంటి పార్టీలతో ఆయన సంప్రదింపులు జరిపి మద్ధతు కూడగట్టారు. బీజేపీకి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీల మధ్య వైరం వున్నప్పటికీ గోయల్ పార్లమెంట్ లోపల, వెలుపలా టీఎంసీ నేతలతో సన్నిహిత సంబంధాలను నెరుపుతున్నారు.

ఈ పదవికి కేబినెట్ మంత్రి, న్యాయవాది భూపేందర్ యాదవ్ పేరుని బీజేపీ అధిష్టానం పరిశీలించింది. పార్లమెంటరీ సెలక్ట్ కమీటీలలో అపార అనుభవం వున్నందున ఆయనను కమిటీ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీకి కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా... ఎన్నికల సంఘం, కోర్టులకు సంబంధించిన విషయాలపైననా యాదవ్‌కు పట్టుంది. 

కాగా, జులై 19 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ నిబంధనల నడుమ సభను నిర్వహిస్తామని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. ఇప్పటికే మెజారిటీ సభ్యులు వ్యాక్సిన్‌ తీసుకున్నారని.. ఒకవేళ టీకా తీసుకోని వారు సమావేశాల సమయంలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.