ముంబాయి: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో చిక్కొచ్చిపడింది. తమకు చెల్లించాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లించకపోతే విమానాలు నడపబోమని ఎయిరిండియా పైలట్లు తేల్చి చెప్పేశారు. వేతనం, ఇతర అలోవెన్స్‌ల చెల్లింపులో  పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది పట్ల ఎయిరిండియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోషియేన్ ఆరోపించింది. ఇతర సిబ్బందికి  పూర్తి చెల్లింపులు చేశారని...కానీ పైలట్లు, క్యాబిన్‌ సిబ్బందికి మాత్రం ఫ్లయింగ్‌ అలోవెన్స్‌లను ఎందుకు నిలిపివేస్తున్నారని అసోషియేషన్ ప్రశ్నించింది.  

ఫ్లయింగ్‌ అలోవెన్స్‌లు వెంటనే చెల్లించకపోతే విధులు నిర్వర్తించబోమని...ఎట్టిపరిస్థితుల్లో విమానాలు నడపమని తేల్చి చెప్పేసింది. రూల్స్ ప్రకారం పైలట్లకు ఫ్లయింగ్‌ అలోవెన్స్‌లను రెండు నెలల తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. అయితే జూన్‌ నెలకు సంబంధించిన అలోవెన్స్‌లు ఆగష్టు నెల సగం పూర్తి అయినా చెల్లించకపోవడాన్ని అసోషియేషన్ తప్పుపడుతుంది. 

ఇప్పటికైనా ఎయిరిండియా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరింంది. లేని పక్షంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే అందుకు యాజమాన్యమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే సమస్యల్లో ఉన్న ఎయిరిండియాకు పైలట్ల వార్నింగ్ కొత్తి చిక్కులు తెచ్చిపెట్టింది. 

వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఇటీవలే ప్రభుత్వం ప్రయివేటీకరణ బాట పట్టింది. ఎయిరిండియాలో మెజార్టీ వాటాను అమ్మాలని ప్రయత్నించింది. అయితే  కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.