పనిమనిషిగా పదేళ్ల బాలిక.. నిత్యం నరకం చూపిస్తూ , ఢిల్లీలో దంపతులను చితకబాదిన స్థానికులు
పదేళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేస్తే, వేధించిన పైలట్ దంపతులను స్థానికులు చితకబాదారు. ఢిల్లీలోని ద్వారకలో ఈ ఘటన జరిగింది. సమయానికి పోలీసులు రాకుంటే వీరిద్దరిని జనం కొట్టి చంపేసేవారే.

ఢిల్లీలో దారుణం జరిగింది. నగరంలోని ద్వారకలో పదేళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకుని చిత్రహింసలకు గురిచేశారంటూ మహిళా పైలట్, ఆమె భర్తపై గుంపు దాడి చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్‌లో పైలట్ యూనిఫాంలో వున్న మహిళను పెద్ద సంఖ్యలో గుమిగూడిన జనం పదే పదే చెప్పుతో కొట్టడం కనిపించింది. ఆమె సహాయం కోసం అరుస్తూ, ఏడుస్తుండగా బాధితురాలిని పదుల సంఖ్యలో మహిళలు చితకబాదారు. క్షమించమని వేడుకున్నా.. వారు కొడుతూనే వున్నారు. ఆమె భర్తపైనా మరికొందరు వ్యక్తులు దాడి చేశారు. వీరిని అడ్డుకునేందుకు కొందరు జోక్యం చేసుకుంటుండగా ఆయన తన భార్యను రక్షించడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఓ వ్యక్తి ఆమె చచ్చిపోతోంది అని అరవడం వినిపించింది.
మీడియా నివేదికలను బట్టి.. పైలట్ దంపతులు రెండు నెలల క్రితం ఇంటి పనుల నిమిత్తం పదేళ్ల బాలికను పనిమనిషిగా పెట్టుకున్నారు. ఒక రోజున బాలిక బంధువు ఆమె చేతులపై గాయాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే బాలికపై వారు తరచుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, కొడుతున్నారని స్థానికులు ఆరోపించారు. బాలిక చేతులపై , కళ్ల కింద గాయాల గుర్తులు కనిపించడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. వెంటనే జనమంతా కలిసి పైలట్ దంపతులపై దాడికి దిగి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దంపతులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్వారకకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఎం హర్షవర్థన్ కూడా బాలిక చేతులపై కాలిన గాయాలను గుర్తించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమెకు కౌన్సెలింగ్ కూడా అందించామన్నారు. చిన్నారి వాంగ్మూలం ఆధారంగా భారత శిక్షస్మృతి, బాల కార్మిక నిషేధ చట్టం ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు హర్షవర్ధన్ వెల్లడించారు. వాస్తవానికి భారతదేశంలో మైనర్ పిల్లలను పనిమనుషులుగా నియమించుకోవడం, పని ప్రదేశాల్లో వుంచుకోవడం నిషేధించబడింది. కానీ ఈ నియమాన్ని కొందరు ఉల్లంఘిస్తున్నారు.