ఆసుపత్రుల నిర్వహణలో ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్న హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షపు నీరు రావడం కలకలం రేపింది. తాజాగా కర్ణాటకలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో పందులు స్వేచ్ఛగా తిరుగున్నాయి.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని కలబురగిలోని కోవిడ్ ఆసుపత్రిలో ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ కర్గే స్పందిస్తూ.. ఆసుపత్రుల నిర్వహణ సవ్యంగా లేకపోవడంతో ఇలాంటి చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.

Also Read:సీఎంలకు ప్రధాని ఫోన్: కేసీఆర్‌, జగన్‌లతోనూ మాట్లాడిన మోడీ.. ఉలిక్కిపడ్డ అధికార వర్గాలు

మరోవైపు ఆసుపత్రిలో పందుల విహారంపై వీడియో వైరల్ కావడంతో ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రి అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

కాగా, దేశంలో తొలి కోవిడ్ 19 మరణం కలబురగిలో చోటు చేసువడం గమనార్హం. కరోనా కేసులు విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో ఈ వ్యాధి నుంచి దేవుడే మనల్ని కాపాడాలని మంత్రి శ్రీరాములు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Also Read:కరోనా భయం: భర్త డెడ్‌బాడీని తోపుడు బండిపై తీసుకెళ్లిన భార్య

మనమంతా జాగ్రత్తగా ఉండాలి.. మీరు పాలక పార్టీ సభ్యులైనా, విపక్ష సభ్యులైనా, విపక్ష సభ్యులైనా, సంపన్నులైనా, పేదలైనా ఈ వైరస్‌‌‌కు ఎలాంటి వివక్ష ఉండదని శ్రీరాములు ఇటీవల మీడియాతో అన్నారు.

అటు శ్రీరాములు వ్యాఖ్యలపై విపక్ష కాంగ్రెస్ మండిపడింది. కోవిడ్ 19ను ఎదుర్కోవడంలో యడ్యూరప్ప సర్కార్ సామర్ధ్యానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇక గతంలో గుల్బర్గాగా పేరొందిన కలబురగిలో ఇప్పటి వరకు 2,674 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.