గాల్వాన్‌ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. చైనాను దెబ్బకు దెబ్బా తీయాలని చెబుతూనే.. డ్రాగన్ దేశానికి చెందిన వస్తువులను నిషేధించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో చైనాకు సంబంధించిన కొన్ని మొబైల్ అప్లికేషన్లను భారత్‌లో నిషేధిస్తున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది.

టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్‌లకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జాతీయ సమాచార చట్టం (ఎన్ఐసీ) ఉత్తర్వులు చేసినట్లు ఆ ఫేక్ పోస్ట్ సారాంశం.

ఇండియాలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో వినియోగంలో ఉన్న చైనాకు చెందిన 13 యాప్ల పనితీరును పరిమితం చేయాలని అందులో పేర్కొన్నారు. టిక్‌టాక్, లైవ్ మి, బిగో లైఫ్, విగో వీడియో. బ్యూటీ ప్లస్, క్యామ్ స్కానర్, క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్, క్లబ్ ఫ్యాక్టరీ, షీన్, రోమ్‌ వే, యాప్ లాక్, వీ మేట్ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు ఆ పోస్టులో ఉంది.

ఈ ఫేక్ న్యూస్‌పై పీఐబీ స్పందిస్తూ.. చైనా యాప్స్ నిషేధించాలంటూ టెక్ కంపెనీలకు ఎన్ఐసీ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వున్న పోస్టు పూర్తిగా అసత్యం. వాటిని నెటిజన్లు నమ్మొద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. ప్రభుత్వం కానీ ఎన్ఐసీ కానీ అలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదని వెల్లడించింది.