ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) మంగళవారం 2022-23కు సంబంధించి అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. ఇందులో ఆర్కిటెక్చర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి కీలక విషయాలను పేర్కొంది.

ఆర్కిటెక్చర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) మంగళవారం కీలక విషయాలను వెల్లడించింది. 2022-23కు సంబంధించి ఏఐసీటీఈ విడుదల చేసిన అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్ ప్రకారం.. ఆర్కిటెక్చర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తప్పనిసరి సబ్జెక్టులు కావని తెలిపింది. అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి కూడా 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తప్పనిసరిగా అవసరం లేదని పేర్కొంది. 

ఇక, ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదవని విద్యార్థులు ఇంజనీరింగ్, టెక్నాలజీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందవచ్చని ఏఐసీటీఈ గత సంవత్సరం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఐచ్ఛికం చేయడం పెద్ద దుమారమే రేపింది. ఇక, AICTE 2022-23 హ్యాండ్‌బుక్‌లో పరిస్థితిని సమీక్షించింది. ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ అనే మూడు కోర్సులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ని ఐచ్ఛికంగా చేయాలని నిర్ణయించింది

‘ఏ కోర్సులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చేయవచ్చో.. సిఫార్సులు చేయడానికి మేము నిపుణుల కమిటీని ఏర్పాటు చేసాము. ప్యానెల్ సిఫార్సుల ఆధారంగా మూడు కోర్సులను ఎంచుకున్నాము’ అని AICTE సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో పాటు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నాలజీ, సాంకేతిక వొకేషనల్ కోర్సు, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంట్రప్రెన్యూర్ షిప్ వంటి సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టుల్లో పాస్ అయి ఉంటే అడ్మిషన్ ను పొందొచ్చు. 

రాబోయే విద్యా సంవత్సరం 2022-23 నుంచి అన్ని అనుబంధ పాలిటెక్నిక్ సంస్థలలో 'PM కేర్స్' పథకం కింద కవర్ చేయబడిన కోవిడ్-అనాథ పిల్లలకు ఒక్కో కోర్సుకు supernumerary seats రిజర్వ్ చేయాలని AICTE నిర్ణయించింది. ఒక్కో కోర్సుకు రెండు సీట్ల రిజర్వేషన్ ఇతర పిల్లలపై ప్రభావం చూపదు.. ఎందుకంటే ఈ నిబంధన కింద విద్యార్థులను చేర్చుకునే ఇన్‌స్టిట్యూట్‌లు వారి మంజూరైన ఇన్‌టేక్ సామర్థ్యాన్ని రెండు పెంచుతాయి. 

PM CARES సర్టిఫికేట్ జారీ చేయబడిన అటువంటి పిల్లలు సూపర్‌న్యూమరీ కోటా క్రింద పాలిటెక్నిక్ సంస్థలలో ప్రవేశానికి అర్హులు అని AICTE కొత్త అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్‌లో పేర్కొంది.