రాజస్థాన్‌లోని సవాయ్ మధోపూర్‌లో 2011లో జరిగిన మతపరమైన అల్లర్ల కేసులో సెషన్స్ కోర్టు 30 మందికి జీవిత ఖైదు విధించింది. ఆనాడు సీఐగా విధులు నిర్వహిస్తున్న ఫూల్ మొహమ్మద్ ఖాన్ ను సజీవంగా దహనం చేసిన కేసులో వీళ్లందరికీ సవాయ్ మధోపూర్‌లోని అడిషనల్ సెషన్స్ కోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది.
రాజస్థాన్‌లోని సవాయిమాధోపూర్ జిల్లా మాంటౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ ఫూల్ మహ్మద్‌ను ఓ దుండగుల మూక సజీవ దహనం చేసింది. 11 ఏళ్ల తర్వాత ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో అప్పటి డీఎస్పీ మహేంద్ర సింగ్ కల్బెలియా సహా 30 మందిని దోషులుగా నిర్ధారించింది. వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంతకుముందు బుధవారం నాడు 49 మందిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది.
అసలేం జరిగింది ?
11 ఏళ్ల క్రితం సవాయిమాధోపూర్‌లో అంటే... మార్చి 17, 2011 న జిల్లాలోని మాంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్వాల్ గ్రామంలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. దాఖాదేవి హంతకులను అరెస్టు చేయాలని, ఆమె కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు. ఒక్కసారిగా ఇద్దరు ఆందోళనకారులు రెచ్చిపోయారు. బన్వారీ లాల్ మీనా, రాజేష్ మీనా పెట్రోల్ నింపిన బాటిళ్లతో వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరూ బెదిరించడం ప్రారంభించారు. దీంతో ఆ పాంత్రంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వాటర్ ట్యాంక్ ఎక్కుతున్న బన్వారీని ప్రజలు ఒప్పించి కిందకు దించగా, రాజేష్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ట్యాంక్‌పై నుంచి కిందకు దూకాడు.
ఈ క్రమంలో అక్కడి పరిస్థితి విషమించింది. మాంటౌన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఫూల్ మహ్మద్, ఇతర పోలీసులపై గుంపు రాళ్లు రువ్వడం ప్రారంభించింది.దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు పోలీసు సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. సీఐ ఫూల్ మహ్మద్ కూడా తన జీపులో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే జనం అతనిని విడిచిపెట్టలేదు. అతన్ని చుట్టుముట్టిన గుంపు జీపుకు నిప్పుపెట్టింది. దీంతో జీపులో కూర్చున్న ఫూల్ మహ్మద్ సజీవ దహనమయ్యాడు.
డీఎస్పీ మహేంద్ర సింగ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష
సీఐ సజీవ దహనమైన ఘటన అందరినీ కలచివేసింది. అప్పటి ప్రభుత్వం ఫూల్ మహ్మద్‌కు అమరవీరుడు హోదా కల్పించి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ హత్య కేసులో సీబీఐ 89 మందిని నిందితులుగా చేసింది. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఐదుగురు కూడా చనిపోయారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఇంకా పరారీలో ఉండటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు అప్పటి డీఎస్పీ మహేంద్ర సింగ్‌తో సహా 30 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మిగిలిన 49 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 30 మంది దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే.. వీళ్లలో కొందరిని రూ. 2, 000 నుంచి రూ. 50,000 వరకు జరిమానా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
