Philippines Earthquake : ఫిలిప్పీన్స్ లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం.. భవనాల నుంచి పరుగులు తీసిన జనం..
Philippines Earthquake : ఫిలిప్పీన్స్ లో 6.7 తీవ్రతతో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు భయపడి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల వల్ల పలు భవనాలు దెబ్బతిన్నాయి.
Philippines Earthquake : దక్షిణ ఫిలిప్పీన్స్ లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఒక్క సారిగా వచ్చిన ఈ భూ ప్రకంపనల వల్ల అక్కడి జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక తమ భవనాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రకంపనల దాటికి పలు భవనాల పైకప్పులు కూలిపోయాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.7గా నమోదు అయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ప్రధాన దక్షిణ ద్వీపం మిండనావోలోని సారంగాని ప్రావిన్స్ లో 78 కిలోమీటర్ల (48 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిదని, అయితే సునామీ ముప్పు లేదని యుఎస్జీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి సమాచారమూ లేదు.
కాగా.. జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించిన తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కార్యకలాపాలకు ఆలవాలమైన పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్ లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. ఇదిలా ఉండగా.. ఈశాన్య మయన్మార్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. షాన్ రాష్ట్రంలోని కెంగ్ తుంగ్ పట్టణానికి నైరుతి దిశగా 76 కిలోమీటర్ల దూరంలో 5.7 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉంది.
ఒక్క సారిగా వచ్చిన ఈ ప్రకంపనలతో కెంగ్ తుంగ్ సిటీ వణికిపోయింది. భూకంపం వచ్చిన ఈ ప్రాంతం చైనా, లావోస్, థాయ్ లాండ్ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఈ ప్రకంపనల తీవ్రత థాయ్ లాండ్ లోని రెండో అతిపెద్ద నగరం, ప్రముఖ పర్యాటక కేంద్రం చియాంగ్ మాయిలోనూ కనిపించాయి. కాగా.. మయన్మార్ లో భూకంపాలు, భూకంపాలు సర్వసాధారణం. అయితే తాజా భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.