ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెట్రోల్ పంప్ సిబ్బంది స్కూటర్‌లో కొట్టిన పెట్రోల్‌ను ట్యాంక్‌లో పైప వేసి వెనక్కి తీసుకున్నారు. స్కూటర్‌లో పెట్రోల్ కొట్టిన తర్వాత స్కూటర్ యజమాని రూ. 2000 నోటు చేతిలో పెట్టడంతో వారు తిరస్కరించారు. అనంతరం, వారు ఆ పెట్రోల్‌ను వెనక్కి తీసుకున్నారు.
Petrol Pump: రూ. 2,000 నోట్లను ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ శుక్రవారం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీ వరకు వాటిని బ్యాంకుల్లో లేదా ఆర్బీఐ రీజినల్ బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చని, లేదా సొంత అకౌంట్‌లో డిపాజిట్ చేయవచ్చని తెలిపింది. ఈ నోట్లు ఇప్పటికిప్పుడే రద్దయినట్టు కాదని, అవి చలమాణిలో ఉంటాయని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ నోట్లను షాపులు సహా అందరూ స్వీకరించాలని ఆర్బీఐ ప్రత్యేకంగా తెలిపింది కూడా. అయినా.. రూ. 2000 నోట్లను వీలైనంత త్వరగా వదిలించుకుంటే బెటర్ అనే అభిప్రాయాల్లో చాలా మంది ఉన్నారు. ఫలితంగానే రూ. 2000తో లావాదేవీలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా బైక్‌లో పెట్రోలో కొట్టించుకున్నాక రూ. 2000 నోటు ఇవ్వడంతో.. సిబ్బంది ఆ నోటును తిరస్కరించారు. బైక్ లో నుంచి పెట్రోల్‌నూ బయటకు తీసేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని జాలౌన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూటర్ పై రూ. 2,000తో ఓ వ్యక్తి పెట్రోల్ పంప్‌కు వెళ్లాడు. పెట్రోల్ కొట్టాలని చెప్పగా.. సిబ్బంది ఆ స్కూట్‌లో చమురు నింపారు. ఆ తర్వాత రూ. 2000 తీసి వారి చేతిలో పెట్టాడు. అంతే.. ఆ సిబ్బంది షాక్ అయ్యారు. రూ. 2,000 నోటును తిరస్కరించారు. రూ. 2000 నోటు కాకుండా తక్కువ డినామినేషన్ నోట్లను ఇవ్వాలని సూచించారు. కానీ, ఆ స్కూటర్ యజమాని ఇవ్వలేదు. దీంతో పెట్రోల్ పంప్ సిబ్బంది స్కూటర్ లో నుంచి పెట్రోల్‌ను వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడ్డారు.
Also Read: దేశ విభజనతో విడిపోయి 75 ఏళ్ల తర్వాత కలిసిన అక్కా తమ్ముడు.. కంటతడి పెట్టించే వీడియో
ఓ చిన్న పైప్‌ను స్కూటర్ పెట్రోల్ ట్యాంక్‌లో వేశారు. అందులో నుంచి పెట్రోల్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ ఘటనను ఆ స్కూటర్ యజమాని వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్నది.
కాగా, ఈ ఘటనపై పెట్రోల్ పంప్ మేనేజర్ రాజీవ్ గిరోత్ర స్పందించారు. రూ. 50 పెట్రోల్ కొట్టించుకుని రూ. 2000 నోట్లు చేతిలో పెడుతున్నారని అన్నారు. గతంలో తమకు రోజుకు మూడు నుంచి నాలుగు రూ. 2000 నోట్లు వచ్చేవని, కానీ, ఇప్పుడు 70 నోట్లు వస్తున్నాయని చెప్పారు. రూ. 2000 తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని, కానీ, రూ. 2,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి పెట్రోల్ కొట్టించుకుంటే సరిపోతుందని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతున్నది.
