Petrol Diesel Price spike: ప్రస్తుతం దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది.
Petrol Diesel Price spike: దేశంలో చమురు ధరలు మరోసారి వాహనదారుల నడ్డి విరుస్తాయా... సామాన్య ప్రజానీకంపై పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం పడనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే ఇంధన ధరల పెంపుపై చర్యలు తీసుకోవడం లేదనీ, ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అయిన గోల్డ్‌మన్ సాక్స్ సైతం భారత్ లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అంచనా వేసింది.
గతేడాది దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ చమురు ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి ఆగ్రహం, ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గత నవంబర్ నెలలో హైదరాబాద్ సహా ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. నవంబర్ 3న హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు రూ.114.49, రూ.107.40 ఉంది. ఇక నవంబర్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.108.2, రూ.94.62లకు చేరుకున్నాయి. ఇతర మెట్రో నగరాల్లో కూడా ఇంధన ధరలు తగ్గాయి. అయితే, నవంబర్ 4 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా ఎలాంటి మార్పు కనిపించలేదు.
అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువలో ఉంది. ప్రస్తుతం, గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $93.10గా ఉంది. నవంబర్ 4న బ్యారెల్‌కు 80.54 డాలర్లుగా ఉంది. అంటే 15.59 శాతం పెరిగింది. గత నెలలో గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసినట్లుగా, ఈ ఏడాది చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ధర పెరగడానికి వివిధ కారణాలున్నాయి. ప్రస్తుతం, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు ధర పెరిగింది. ముడి చమురు, బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రపంచంలో రష్యా అగ్రస్థానంలో ఉన్నందున, దానికి వ్యతిరేకంగా ఏదైనా పాశ్చాత్య ఆంక్షలు ప్రపంచ సరఫరాను విఘాతం కలిగించవచ్చు. అలాగే, ఒపెక్ + దేశాలు, చమురు ఉత్పత్తి చేసే దేశాలు, ఇతర సమస్యలు అంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా డిమాండ్‌తో పోల్చినప్పుడు తక్కువ సంఖ్యలో బ్యారెళ్లను పంపిణీ జరుగుతోంది. దీంతో మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశముంది.
అంతర్జాతీయంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నా.. భారత్‌లోని హైదరాబాద్ సహా అనేక ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమేనని నిపుణులు, పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
నగరాలు లీటరు పెట్రోల్ లీటరు డీజిల్
హైదరాబాద్ రూ. 108.20 రూ. 94.62
ఢిల్లీ రూ. 95.41 రూ. 86.67
ముంబై రూ. 109.98 రూ. 94.14
కోల్‌కతా రూ. 104.67 రూ. 89.79
చెన్నై రూ. 101.40 రూ. 91.43
ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది.
