ఎల్ఆర్ఎస్ ద్వారా అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వాళ్లను, అధికారులను వదిలేసి ప్లాట్లు కొన్నవారు, ఇళ్లు కట్టుకున్న వారిని శిక్షిస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సరైన అధ్యయనం లేకుండా ఎల్ఆర్ఎస్ చేస్తున్నారని జనగాం వాసి జువ్వాడి సాగర్ రావు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 

ఎల్ఆర్ఎస్ ద్వారా అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వాళ్లను, అధికారులను వదిలేసి ప్లాట్లు కొన్నవారు, ఇళ్లు కట్టుకున్న వారిని శిక్షిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. 

అక్రమ లేఔట్ల వల్ల వరదలతో సహా అనేక సమస్యలు వస్తాయని హైదరాబాద్, చెన్నైలో వచ్చిన వరదలు రుజువు చేస్తున్నాయని పిటిషనర్ వివరించారు. అక్రమ లేఔట్లకు అనుమతి ఇచ్చిన వారిపై విచారణ జరపాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లేఔట్ల క్రమబద్దీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 1నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలలపాటు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కు గడువు ఇవ్వగా 25.59లక్షల దరఖాస్తులు వచ్చాయి.

గ్రేటర్ తో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఎప్పుడు పరిష్కరిస్తారని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇప్పటికే దీనిపై కొంత కసరత్తు చేశారు.