అతని ఆటను వారింటి పెంపుడు కుక్క పసిగట్టింది. కామాంధుడి పని పట్టింది. మహిళ మానాన్ని కాపాడింది. 

ఆమె ఓ మానసిక వికలాంగురాలు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే దారుణంగా ప్రవర్తించారు. ఇంట్లో ఉంచాల్సిన మహిళ బయట షెడ్డులో వదిలేశారు. దీంతో... ఆమెపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఎలాగైనా ఆమెను అనుభవించాలని అనుకున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. అయితే.. అతని ఆటను వారింటి పెంపుడు కుక్క పసిగట్టింది. కామాంధుడి పని పట్టింది. మహిళ మానాన్ని కాపాడింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోయంబత్తూరు సెల్వపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు మానసిక వికాలాంగురాలు కావడంతో తల్లిదండ్రులు ఆమె కోసం ఇంటి పక్కన ప్రత్యేకంగా షెడ్డు నిర్మించి దానిలో ఉంచారు. 

ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన దిలీప్‌ కుమార్‌ అనే వ్యక్తి గత నెల 29న బాధితురాలి ఇంటికి వచ్చాడు. షెడ్డులో దూరి మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షెడ్డులో పవర్‌ కట్‌ చేశాడు. అయితే దిలీప్‌ కుమార్‌ చర్యలను గమనిస్తున్న వారి ఇంటి పెంపుడు కుక్క అతడి వెనకే షెడ్డులో ప్రవేశించింది. దిలీప్‌ కుమార్‌ ప్యాంట్‌ పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేసింది. అనుకోని ఈ ఘటనకు బిత్తరపోయిన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కుక్క మాత్రం అతడిని విడిచిపెట్టలేదు. 

ఈలోపు ఇంట్లో కరెంట్‌ ఉండి.. షెడ్డులో పవర్‌ కట్‌ కావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా.. అక్కడ కుక్కతో పెనుగులాడుతున్న దిలీప్‌ కుమార్‌ను గమనించారు. వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి.. అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిలీప్‌ కుమార్‌ ఫోన్‌లో పలువురు మహిళల అసభ్యకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇక కుక్కన్న పాటి దయ కూడా తల్లిదండ్రులకు లేకుండా పోయిందని నెటిజన్లు మండిపడుతున్నారు.