తమ కుటుంబసభ్యుడు చనిపోయాడనుకొని ఖననం చేశారు. కాగా.. ఖననం చేసిన వ్యక్తి మరుసటి రోజు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో కుటుంబసభ్యులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే.. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని చమన్ గంజ్ ప్రాంతానికి చెందిన అహ్మద్ హసన్ (39) కి భార్య నగ్మా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. ఇంట్లో జ‌రిగిన గొడ‌వ‌ల కార‌ణంగా అహ్మ‌ద్ హ‌స‌న్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ స‌భ్యులు చాకేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇంత‌లో యతింఖానా సమీపంలో పోలీసులకు ఒక మృతదేహం ల‌భ్య‌మ‌య్యింది.

 దానిని పోలీసులు అహ్మ‌ద్ కుటుంబ స‌భ్యుల‌కు చూపించారు. వారు దానిని అహ్మద్ మృత‌దేహంగా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వ‌హించిన అనంతరం ఆ మృత‌దేహాన్ని స్మశానవాటికలో ఖననం చేశారు. అయితే ఇంత‌లో అహ్మద్ ఇంటికి తిరిగి వ‌చ్చాడు. 

అహ్మ‌ద్‌ను చూసిన కుటుంబ స‌భ్యులు ఆశ్చ‌ర్య పోయారు. త‌రువాత వారు అతన్ని చాకేరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో పోలీసులు అహ్మ‌ద్‌ను విచారిస్తున్నారు. కాగా యతింఖానా సమీపంలో ల‌భించిన మృత‌దేహం ఎవ‌రిదో ఇంకా తెలియ‌రాలేదు. 

దీంతో పోలీసులు గ‌తంలో ఖననం చేసిన‌ మృతదేహాన్నివెలికితీసి,  డీఎన్ఏ ప‌రీక్ష‌ల కోసం న‌మూనాలు సేక‌రించారు. త‌ద్వారా భవిష్యత్తులో ఎవరైనా ఈ మృత‌దేహం గురించి క్లెయిమ్ చేస్తే, డీఎన్ఏతో స‌రిపోల్చి చూడ‌వ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.