తమ ఇంటి మీద గుర్తు తెలియని వాహనం ఎగురుతూ కనిపించిందని కొందరు... మనిషి లాగే ఉన్న ఆకారం ఇటుగా వెళ్లిందని మరికొందరు చెప్పిన సంఘటనలు ఎన్నో చూసి వుంటాం. అచ్చం ఇలాంటి ఘటన మనదేశంలోనూ జరిగింది.

ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ను పోలిన ఓ బెలూన్‌ నోయిడా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. అది ఏలియన్‌లాగా గాల్లోంచి నేలపై దిగటంతో జనం వణికిపోయారు.

వివరాల్లోకి వెళితే.. గ్రేటర్‌ నోయిడాలోని దాన్‌కౌర్‌ ప్రాంతంలో నిన్న ఉదయం ఓ వింత ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించింది. కొంతసేపటి తర్వాత ఓ కాలువలోకి దిగి, అక్కడే కొద్దిసేపు కదులుతూ కనిపింది.

దానిని చూసిన జనం ఏలియన్‌ అంటూ భయభ్రాంతులకు గురయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అసలు విషయం తేల్చారు.

అది ఏలియన్‌ కాదని.. ఐరన్‌ మ్యాన్‌ను పోలి ఉన్న బెలూన్‌ అని ఆయన స్థానికులకు వివరించారు. బెలూన్‌ గాల్లోకి ఎగరటానికి ఆధారమైన గ్యాస్‌ తగ్గుతుండటంతో అది నేలపై పడిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.