సాధారణ ప్రజలందరూ ఉచిత పథకాల వైపు ఆకర్శితులవుతారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. అయితే రాజకీయ పార్టీలు ధీర్ఘకాలం ప్రయోజనం చేకూర్చే పథకాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఉచిత పథకాల వల్ల శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం మన దేశం కూడా ఎదుర్కోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ ప్ర‌భుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, నీటి పథకంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. ప్రజలు ఉచితాలను ఇష్టపడతారని అన్నారు. అయితే రాజకీయ పార్టీలు ధీర్ఘకాలిక అభివృద్ధి విష‌యంలో ఆలోచించాల‌ని తెలిపారు. ఈ ప‌థ‌కాల వ‌ల్ల అభివృద్ధి జ‌ర‌గ‌ద‌ని అన్నారు. 

ఇటీవ‌ల ప్రధాని నరేంద్ర మోదీతో అధికారుల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పలు రాష్ట్రాలు ప్రకటించిన ప్రజాకర్షక పథకాలపై కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో అజిత్ ప‌వార్ గురువారం ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఉచితంగా నీరు, విద్యుత్ అందించడంలో రాష్ట్ర అదాయానికి గండిప‌డుతుంద‌ని అన్నారు. దీని వ‌ల్ల అభివృద్ధి ప‌నులకు వ‌న‌రులు స‌రిపోవ‌ని చెప్పారు. 

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌న్నుల విష‌యంలో కూడా అజిత్ ప‌వార్ మాట్లాడారు.‘‘ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా పన్ను తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కంటే ఎక్కువ పన్ను విధిస్తోంది. దీనిని కేంద్ర ప్ర‌భుత్వం పునఃపరిశీలించాలి ” అని అజిత్ పవార్ తెలిపారు. 

గ‌త శనివారం లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని 7లోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో నాలుగు గంటలపాటు ప్రధాని సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల‌పై చ‌ర్చ జ‌రిగింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ఉచిత ప‌థ‌కాల వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చాలా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని చెప్పారు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాలు కూడా ఇలాంటి హామీలు ఇస్తున్నాయ‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చివ‌రికి శ్రీలంక‌కు ఎదురైన ప‌రిస్థితులు మ‌న‌కు కూడా ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. 

కాగా అరవింద్ కేజ్రీవాల్ త‌న ప్రజాకర్షక పథకాలను సమర్థించుకున్నారు. ఈ విష‌యంలో ఫిబ్ర‌వ‌రిలోనే ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఉచితాలు స‌రైన‌వే అని అన్నారు. ‘‘ బీజేపీ వంటి పార్టీలు ఈ సమస్యను లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే వారికి దోచుకోవడానికి ఏమీ మిగిలి లేదు. అమెరికాలో మాదిరిగానే ఉచితాలను సామాజిక భద్రతతో సమానం చేస్తూ ఢిల్లీ సీఎం ప్రజలకు తమ సొంత డబ్బుతో ఉచిత విద్యుత్ ఇస్తున్నారు’’ అని అన్నారు. గ‌తంలో కూడా ఈ ఉచిత ప‌థ‌కాలపై ఆయ‌న ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు వ‌చ్చే స‌బ్సిడీల్లో కోత పెట్టి సామాన్యుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తున్నామ‌ని తెలిపారు. 

పంజాబ్ ఎన్నిక‌ల‌కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఉచిత ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించింది. అయితే ఈ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌పై పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ఆ స‌మ‌యంలో స్పందించారు. ఆప్ ప్ర‌క‌టించిన ఉచిత విద్యుత్, మ‌హిళ‌ల‌కు నెలవారీ ఆదాయం క‌ల్పించే ప‌థ‌కాల‌ను ‘‘లాలీపాప్‌లు’’ అంటూ అభివర్ణించారు. ఈ ప‌థ‌కాల‌ను అమలు చేయ‌డానికి అవ‌స‌మ‌రైన మొత్తాన్ని ఎలా స‌మ‌కూరుస్తార‌ని ప్ర‌శ్నించారు.